Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- త్రిపుర ప్రభుత్వ అరాచకాలను ప్రధాని, రాష్ట్రపతికి నివేదిస్తాం : మాణిక్ సర్కార్
ఆగర్తల: రాష్ట్రంలో లెఫ్ట్ ఫ్రంట్ సభ్యులపై త్రిపుర ప్రభుత్వం దురాగతాలను ప్రధాని మోడీ, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు నివేదిస్తామని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ ప్రకటించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి విప్లవ్‌దేవ్ కుమార్, గవర్నర్ రమేష్ బైస్ తమ విన్నపాలను పట్టించుకోవడం లేదని మాణిక్ సర్కార్ తెలిపారు. ఆగర్తలలో ఆదివారం మధ్యాహ్నాం నిర్వహించిన మీడియా సమావేశంలో మాణిక్ సర్కార్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ప్రతిపక్ష నాయకులుపై జరుగుతున్న హింసను నియంత్రించడంలో త్రిపురలోని బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం విఫలమయిందని విమర్శించారు. హోం మంత్రత్వ శాఖను ముఖ్యమంత్రి తన వద్దే ఉంచుకున్నారు. ప్రభుత్వ యంత్రాంగం, పోలీసులు 'అధికార పార్టీ తోలుబొమ్మలు'గా మారిపోయారనీ, చట్టాలు పదేపదే ఉల్లంఘించబడుతున్నాయని సర్కార్ విమర్శించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, గవర్నర్‌ను సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యవర్గం రాజ్‌భవన్‌లో కలిసి, యావత్తు రాష్ట్రంలో జరుగుతున్న చట్టవ్యతిరేక కార్యక్రమాల గురించి వివరించిందన్నారు. ఆ మరుసటి రోజు నుంచి ఇలాంటి జరగవని వారు హామీ ఇచ్చారని మాణిక్ సర్కార్ తెలిపారు. ఈ విషయంపై డీజీపీ, ముఖ్యమంత్రితో చర్చిస్తానని గవర్నర్ హామీ ఇచ్చినట్లుగానూ ఆయన తెలిపారు. అయితే ఎలాంటి ఫలితం కనిపించలేదని తెలిపారు. 'మార్చి 3న అసెంబ్లీలో అప్పటి వరకూ ప్రతిపక్ష నేతలపై 200 దాడులు జరిగాయని ముఖ్యమంత్రి ప్రకటించారు. గవర్నర్‌ను సీపీఐ(ఎం) బృందం కలిసిన తరువాత 60 దాడులు జరిగాయి' అని మాణిక్ తెలిపారు. రాష్ట్రంతో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత గణాంకాలను మాణిక్ సర్కార్ ప్రస్తావించారు. '2019 జూన్ 28 నుంచి 2021 జూన్ 25 వరకూ రాష్ట్రవ్యాప్తంగా 9 మూకదాడులు, కస్టడీ మరణాలు సంభవించాయి. ఉదయిపూర్, పశ్చిమ ఆగర్తల పోలీస్ స్టేషన్, సెంట్రల్ జైల్, అమరాపూర్ సబ్‌జైలు, కమలాపూర్ పోలీస్ స్టేషన్లలో కస్టడీ మరణాలు జరగాయి. ఇవన్నీ అందోళనకర పరిస్థితులకు దారి తీసాయి' అని చెప్పారు. కరోనా మహమ్మారి నేపధ్యంలో అనేక మంది ప్రజలు శానిటైజర్లు, మాస్కులు, రేషన్ కిట్లను పంపిణీ చేయడానికి ముందుకు వచ్చారనీ, అయితే వీరిపై బీజేపీ నేతలు దాడులకు గురయ్యారని మాణిక్ సర్కార్ తెలిపారు.