Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కరువు భత్యం (డీఏ), పింఛనుదారులకు కరువు ఉపశమనం (డీఆర్)లకు సంబంధించి తాము ఎటు వంటి ఉత్తర్వులు ఇవ్వలేదని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించింది. ప్రస్తుతం జులై నుంచి కేంద్రం డీఏ, డీఆర్‌లను పునరుద్ధరిస్తున్నట్టు పేర్కొన్నటువంటి ఓ ఉత్తర్వు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. దానిని తాము జారీ చేయలేదనీ, అది నకిలీ అంటూ ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. ''సామాజిక మాధ్యమాల్లో ఓ ఉత్తర్వు చక్కర్లు కొడుతోంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ, పింఛన్ దారులకు డీఆర్‌ను పునరుద్ధరిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. కానీ, అది నకిలీది. తాము ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదు'' అని ట్వీట్ చేసింది. కాగా, 50 లక్షల మంది ఉద్యోగులు, 61 లక్షల మంది పింఛనుదారులకు డీఏ పెంపును గత ఏడాది ఏప్రిల్‌లో కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది. మహమ్మారి నేపథ్యంలో ఈ ఏడాది జూన్ 30 వరకు పెంపును ఆపింది. కరోనా సంక్షోభం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే.