Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లక్నో: రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రామ్‌నాథ్ కోవింద్ తొలిసారిగా స్వగ్రామానికి వెళ్లారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్ జిల్లా పరుంఖ్ గ్రామానికి సమీపంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద దిగిన ఆయన ఒకింత ఉద్వేగానికి గురయ్యారు. వంగి చేతిని నేలకు ఆనించి నమస్కరించారు. తిరిగి ఆ చేతిని శిరస్సుకు తగిలించుకొని మాతృభూమిపై తనకున్న ప్రేమను చాటుకున్నారు.యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనందిబెన్ పటేల్ హెలిప్యాడ్ వద్దకు చేరుకొని రాష్ట్రపతికి సాదర స్వాగతం పలికారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన అభినందన సభలో రాష్ట్రపతి మాట్లాడారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో వ్యాక్సినేషన్ ప్రక్రియ సజావుగా సాగుతున్నదనీ, అర్హులైన వారంతా టీకా వేయించుకోవాలన్నారు. వ్యాక్సిన్ వేసుకోవడంతో పాటు చుట్టుపక్కల వారు వేయించుకునేలా ప్రోత్సహించాలని సూచించారు. గ్రామ ప్రజల ఆదరాభిమానాలను ఈ జన్మలో మరచిపోలేనన్నారు. '' నేను ఎక్కడున్నా.. నా మాతృభూమి మట్టి వాసన, గ్రామస్థుల తీపి గుర్తులు ఎప్పుడూ నా వెంటే ఉంటాయి. మీరంతా ఎప్పటికీ నా గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. పరుంఖ్ కేవలం ఓ గ్రామం కాదు.. నాకు ఎన్నో విషయాలను నేర్పించి, దేశానికి సేవ చేయగలిగే స్థితికి తీసుకెళ్లిన నా మాతృభూమి'' అని కోవింద్ అన్నారు. తనలాంటి ఓ అతి సామాన్య వ్యక్తి దేశంలోనే అత్యున్నత స్థానాన్ని అధిరోహించగలడని కలలో కూడా అనుకోలేదనీ, కానీ ప్రజాస్వామ్య వ్యవస్థ దీనిని నిరూపించి చూపించిందని ఆయన అన్నారు.