Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జమ్మూ ఎయిర్‌పోర్టులో స్వల్ప వ్యవధిలో రెండు పేలుళ్లు
- ఇద్దరు వాయుసేన సిబ్బందికి గాయాలు
- ఉగ్రదాడేనని అధికారుల అనుమానం
- ఘటనపై ఆరాతీసిన రాజ్‌నాథ్
- దర్యాప్తు చేపట్టిన ఎన్ఐఏ
జమ్ము: జమ్మూ ఎయిర్‌పోర్టులోని భారత వైమానిక దశ(ఐఏఎఫ్) బేస్ వద్ద ఆదివారం తెల్లవారుజామున వరుస బాంబు పేలుళ్లు కలకలం రేపాయి. 6 నిమిషాల వ్యవధిలో రెండుసార్లు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు వాయుసేన సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయి. పాకిస్తాన్ సరిహద్దుకు 14 కిలోమీటర్ల దూరంలో, కట్టుదిట్టమైన భద్రత నడుమ ఉండే విమానాశ్రయంలో ఈ పేలుళ్లు చోటుచేసుకోవడం గమనార్హం. ఉగ్రదాడిలో భాగంగా మొదటిసారి డ్రోన్లను వినియోగించినట్టు అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఐఏఎఫ్ స్టేషన్‌పై జరిగిన ఈ దాడి ఉగ్రదాడి అని జమ్ముకాశ్మీర్ పోలీస్ చీఫ్ దిల్బాగ్ సింగ్ పేర్కొన్నారు. తెల్లవారుజాము 2 గంటలకు ముందు 1.37, 1.43 గంటల సమయంలో చోటుచేసుకున్న ఈ వరుస పేలుళ్ల శబ్ధం కిలోమీటరు దూరం వరకు వినిపించింది. ఒక పేలుడు ధాటికి టెక్నికల్ విభాగానికి చెందిన భవన పైకప్పు దెబ్బతినగా, మరో పేలుగు బహిరంగ ప్రదేశంలో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న బాంబు స్క్వాడ్, ఫోరెన్సిక్ బృందాలు ఘటనాస్థలికి చేరుకొని తనిఖీలు చేపట్టాయి. పేలుడు ఘటనపై కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాధ్ సింగ్ ఆరా తీశారు. వైస్ ఎయిర్ చీఫ్ ఎయిర్ మార్షల్ హెచ్ఎస్ అరోరాతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ దాడిలో తీవ్రవాదుల హస్తం ఏమైనా ఉందా అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది. జమ్ము విమానాశ్రయ రన్‌వే, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థ ఐఏఎఫ్ నియంత్రణలో ఉంటాయి. ఇక్కడ ప్యాసెంజర్ విమానాలతో ఎయిర్‌ఫోర్స్ విమానాలు కూడా రాకపోకలు సాగిస్తుంటాయి. తాజా బాంబు పేలుళ్ల ఘటనతో విమాన సేవలకు అంతరాయం కలగలేదని జమ్ము ఎయిర్‌పోర్టు డైరెక్టర్ ప్రవాత్ రంజన్ తెలిపారు.
పేలుళ్ల ఘటనపై చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం(యూఏపీఏ) కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అనుమానితులను అరెస్టు చేయడంతో పాటు వారిని ఎటువంటి సాక్ష్యాధారాలు లేకుండా ఆరు నెలల పాటు నిర్బంధంలో ఉంచేందుకు ఈ చట్టం అనుమతిస్తుంది. పేలుళ్లపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) దర్యాప్తు చేపట్టింది. ఐఎఎఫ్, నేషలన్ బాంబ్ డేటా సెంటర్, ఫోరెన్సిక్ నిపుణుల బృందాలతో పాటు జమ్ముకాశ్మీర్ పోలీసులు కూడా దాడిపై విచారణ చేస్తున్నాయి. దిల్బాగ్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. జనసమూహ ప్రాంతాల్లో పేలుళ్లకు వినియోగించే ఐఈడీ పదార్థాలతో ఉన్న లష్కర్-ఏ-తోయిబాకు చెందిన ఉగ్రవాదిగా భావిస్తున్న ఒక వ్యక్తిని అరెస్టు చేయడం ద్వారా మరో భారీ దాడికి అడ్డుకున్నామని, అయితే ఈ అరెస్టుకు, విమానాశ్రయంపై దాడికి ఎటువంటి సంబంధం లేదని పేర్కొన్నారు.
గతంలో పలుమార్లు 'డ్రోన్ల' ఘటనలు
సరిహద్దు ప్రాంతాల్లో ఉగ్రవాదులకు ఆయుధాలు సరఫరా చేసేందుకు పాక్ గత రెండు సంవత్సరాలుగా డ్రోన్లను వినియోగిస్తుందన్న ఆరోపణలు ఉన్నాయి. 2019 ఆగస్టు 13న మొదటిసారిగా అమృత్సర్ సమీపంలోని ఒక గ్రామం వద్ద కూలిపోయిన డ్రోన్ శకలాలను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. సెప్టెంబర్‌లో ఎనిమిది సార్లు డ్రోన్లు వచ్చి ఆయుధాలు, మాదకద్రవ్యాలను జారవిడిచి వెళ్లాయన్న ఆరోపణలపై భద్రతా బలగాలు పలువురు ఉగ్రవాదులను అరెస్టు చేశాయి. 2020 జూన్ 20వ తేదీన జమ్ములోని కథువా జిల్లాలో అనుమానిత నిఘా డ్రోన్‌ను బిఎస్ఎఫ్ కూల్చివేసింది. 2020 సెప్టెంబర్‌లో అక్నూర్ సెక్టార్ పరిధిలోని ఒక గ్రామంఒలో డ్రోన్ ద్వారా ఆయుధాలు జారవిడిచినట్లు పోలీసులు గుర్తించారు. ఈ విధంగా ఆయుధాలను పొందిన ముగ్గురు ఉగ్రవాదులను అరెస్టు చేశారు.
లఢఖ్‌లో రాజ్‌నాథ్ పర్యటన
మూడు రోజుల లఢఖ్ పర్యటనలో భాగంగా రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆదివారం అక్కడకు చేరుకునే కొన్ని గంటల ముందు ఈ పేలుళ్లు చోటుచేసుకున్నాయి. లఢఖ్ సరిహద్దు ప్రాంతంలో భారత్, చైనా బలగాల ఉపసంహరణ ప్రక్రియలో ప్రతిష్టంభన నెలకొన్న సమయంలో రాజ్‌నాథ్ ఈ పర్యటన చేపట్టడం గమనార్హం. సరిహద్దు వివాదం ఇంకా సమసిపోని నేపథ్యంలో ఈ ప్రాంతంలో సైనిక సంసిద్ధతమై రాజ్‌నాథ్ సమీక్ష చేయనున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. లఢఖ్ చేరుకున్న అనంతరం రాజ్‌నాథ్ కార్గిల్, లేV్‌ా, లఢఖ్ అటానమస్ హిల్ డెవపల్‌మెంట్ కౌన్సిల్ ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యార. ప్రాంతీయ అభివృద్ధిపై వారితో చర్చించారు. తరువాత ఆర్మీ చీఫ్ ఎంఎం నవరాణేతో కలిసి మాజీ సైనిక అధికారులతో సమావేశంలో పాల్గొన్నారు. వారి సంక్షేమంతో పాటు దేశభద్రతపై చర్చించారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్ మాట్లాడుతూ దేశం పట్ల మన సైనికుల, మాజీ సైనికుల అంకితభావం ఒక ఆదర్శప్రాయమైన ఉదాహరణ అని, వారందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాని అన్నారు. సైనికుల సమస్యల పరిష్కారం కోసం ఒక హెల్ప్‌లైన్ నంబర్ ఏర్పాటు చేశామని తెలిపారు.