Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొన్ని వారాలుగా ఇదే తీరు
- టీకాలపై లోపించిన చైతన్యం, తప్పుడు సమాచారంపై ఆరోగ్య నిపుణుల ఆందోళన
న్యూఢిల్లీ: దేశంలో 60 ఏండ్లు పైబడిన వారికి ఇచ్చే వ్యాక్సినేషన్ వేగం తగ్గిపోయింది. గత కొన్ని వారాలుగా ఈ పరిస్థితి నెలకొన్నది. ఈ విషయంపై ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. టీకాల గురించి చైతన్యం లోపించడం, తప్పుడు సమాచారం, నిరాధార భయాలు వంటివి ఇందుకు కారణాలుగా చెప్పారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సమాచారం ప్రకారం.. 60 ఏండ్లు పైబడినవారిలో ఇప్పటి వరకు 2.29 కోట్ల మంది పూర్తిగా వ్యాక్సిన్‌ను పొందారు. మరోపక్క, 6.71 కోట్ల మందికి ఒక్క డోసు వ్యాక్సిన్ మాత్రమే అందింది. 2021లో దేశంలో 60 ఏండ్లు పై బడినవారు 14.3 కోట్ల మంది ఉంటారని అంచనా. కానీ, ఇందులో కేవలం 16 శాతం మంది ఇప్పటి వరకు పూర్తిగా వ్యాక్సిన్‌ను పొందారు. తొలుత 60 ఏండ్లు పై బడిన వారికి ఆ తర్వాత 45 ఏండ్లు పై బడినవారితో పాటు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారికి మార్చి 1 నుంచి ప్రభుత్వ, ప్రయివేటు కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ను ప్రారంభించిన విషయం విదితమే. మార్చి 13 నుంచి ఏప్రిల్ 2 మధ్య 60 ఏండ్లు పైబడినవారికి సగటున దాదాపు 80.77 లక్షల వ్యాక్సిన్ డోసులు అందాయి. అయితే, జూన్ 5 నుంచి 25 మధ్య ఆ వేగం తగ్గి 32 లక్షలుగా మాత్రమే నమోదు కావడం గమనార్హం.
కాగా, దీర్ఘకాలిక వ్యాధులు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారికి వ్యాక్సినేషన్ ప్రక్రియ నెమ్మదిగా కొనసాగడంపై ఆరోగ్యరంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, కోవిడ్ వ్యాక్సిన్ కవరేజీ విషయంలో అపోహలు, అవగాహనారాహిత్యం వంటివి అతిపెద్ద అడ్డంకిగా మారాయని వైద్యులు సుజీత్ రంజన్ తెలిపారు. వ్యాక్సిన్ వేగం తగ్గిపోవడమనేది అసలైన పెద్ద సమస్య అని ఉజాలా సిగస్ గ్రూప్ ఆఫ్ హాస్పటల్స్ వ్యవస్థాపక డైరెక్టర్ డాక్టర్ శుచిన్ బజాజ్ వెల్లడించారు. కాగా, వ్యాక్సినేషన్ వేగం తగ్గిన క్రమంలో టీకాలు తీసుకోవాలంటూ ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సినిమా నటులు వంటి ప్రభావవంతమైన వ్యక్తులు సమాజానికి పిలుపునివ్వాలని వైద్యులు సూచించారు.
50 ఏండ్ల లోపువారిలో కోవిడ్ మరణాలు అధికం : ఏయిమ్స్ అధ్యయనం
కోవిడ్-19 ప్రమాదం 65 ఏండ్లు పైబడినవారి కంటే 50 ఏండ్లలోపు రోగుల్లోనే అధికమని ఢిల్లీలోని ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అధ్యయనంలో తేలింది. సెప్సిస్‌తో బహుళ అవయవాలు పనిచేయకపోవడం మరణానికి అత్యంత సాధారణ కారణమని ఇది వెల్లడించింది. వైద్యులు రణ్‌దీప్ గులేరియా, రాజేశ్ మల్హోత్రల ఈ తాజా అధ్యయనం ఇండియన్ జర్నల్ ఆఫ్ క్రిటికల్ కేర్ మెడిసిన్ లో ఇటీవల ప్రచురితమైంది. గతేడాది ఏప్రిల్ 4 నుంచి జులై 24 మధ్య ఆస్పత్రుల్లో చేరిన రోగుల మరణాలను కవర్ చేస్తూ ఈ నివేదిక ఉన్నది. ఇది బహుళ రోగాలు, సమస్యలు, మరణాలకు గల కారణాలపై దృష్టిని సారించింది. నివేదిక సమాచారం ప్రకారం.. గతేడాది ఏప్రిల్ 4 నుంచి జులై 24 మధ్య 654 ఐసీయూ అడ్మిషన్లు (పెద్దలు) జరిగాయి. వీరిలో 247 మరణాలు సంభవించాయి. వీటిలో 42.1 శాతం మరణాలు 18 నుంచి 50 ఏండ్ల మధ్యవారిలో ఉన్నాయి. 51-65 ఏండ్ల లోపు ఉన్నవారు 34.8శాత మంది, 65 ఏండ్లు పైబడినవారు 23.1శాతం మంది కరోనాతో మరణించారు. కాగా, మరణించినవారిలో 69 శాతం మంది పురుషులే ఉన్నారు.