Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్, హర్యానాలో రైతుల ర్యాలీ
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన వివాదాస్పద మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతు ఉద్యమం కొనసాగుతూనే ఉంది. రైతన్నల ఉద్యమానికి ఏడు నెలలు పూర్తయిన సందర్భంగా ''వ్యవసాయాన్ని కాపాడండి.. రాజ్యాంగాన్ని రక్షించండి'' అంటూ పంజాబ్, హర్యానాలలోని రైతులు భారీ ర్యాలీ చేపట్టారు. ఇరు రాష్ట్రాలకు చెందిన రైతులు రాజ్‌భవన్‌లో గవర్నర్‌కు మెమొరాండం ఇచ్చేందుకు పెద్ద సంఖ్యలో తరలిరాగా వారిని రాజధాని సరిహద్దుల్లోనే పోలీసులు అడ్డుకున్నారు. రైతులపై జల ఫిరంగులు ప్రయోగించారు. పంజాబ్‌లోని మొహాలి నుంచి, హర్యానాలోని పంచకుల నుంచి వచ్చే రైతులను అడ్డుకునేందుకు పోలీసులు చంఢగీఢ్ చుట్టూ బారికేడ్లను ఏర్పాటుచేశారు. ఈ ర్యాలీలో రైతు సంఘం నాయకులు యోగేంద్ర యాదవ్, బల్బీర్ సింగ్ రాజేవాల్, గుర్నామ్ సింగ్‌లు పాల్గొన్నారు. రైతుల తరఫున వీరు పంజాబ్, హర్యానా గవర్నర్లకు మెమొరాండం అందజేశారు.
కాగా, అంతకుముందు గురుద్వారా అంబ్ సాహిబ్ లో జరిగిన సభలో ప్రసంగించిన రాజేవాల్.. నూతన సాగు చట్టాలు తీసుకువచ్చిన ప్రధాని మోడీ సర్కారుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు వ్యవసాయాన్ని అప్పగించడానికి ఉద్దేశించినవే ఈ చట్టాలు అంటూ ఆరోపించారు. అలాగే, హర్యానా స్వతంత్ర ఎమ్మెల్యే సోమ్ బీర్ సంగ్వాన్ మాట్లాడుతూ.. మోడీ ప్రభుత్వ నూతన సాగు చట్టాలు రైతన్నలను నాశనం చేస్తాయని అన్నారు. హర్యానాలో రాజ్‌భవన్‌కు జరిగిన రైతు మార్చ్‌లో ఎఐకెఎస్ అధ్యక్షుడు అశోక్ ధావలే పాల్గొన్నారు. తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణాదితో సహా 20కి పైగా రాష్ట్రాల్లో రాజ్భవన్ల ముట్టడి విజయవంతమైందని ఆయన అన్నారు. త్రిపుర, మణిపూర్ సహా ఈశాన్య ప్రాంతంలో కూడా దీనికి మంచి మద్దతు లభించిందన్నారు.
అడ్డగింపులు.. అరెస్టులు..
ఇదిలావుండగా, రైతులు చేపట్టిన ర్యాలీలను అడ్డుకునేందుకు పోలీసులు ఎక్కడికక్కడ భారీ స్థాయిలో మోహరించారు. పంజాబ్, హర్యానా రాజ్భవన్లకు వెళ్లకుండా రైతులను ఆపడానికి చంఢగీఢ్, పరిసర ప్రాంతాల్లో బారికేడ్లు, పోలీసుల బలగాలే కనిపించాయి. పలుచోట్ల రైతుల ర్యాలీలను పోలీసులు అడ్డుకున్నారు. చాలా మంది రైతు నేతలను అరెస్టు చేశారు. కాగా, రైతులు తమ నిరసనలు ఆపాలని, వారితో చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. అయితే, కేంద్రంతో రైతులు ఇప్పటికే 11 సార్లు చర్చలు జరిపినా ఫలితం తేలకపోవడంతో అన్నదాతలు నిరసనలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.