Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో గవర్నర్ల తీరు వివాదాస్పదం
- రాజకీయ రగడకు తెరలేపిన ప.బెంగాల్ గవర్నర్
- మహారాష్ట్ర, గోవా, పుదుచ్చెరీలో ప్రజాస్వామ్యం అభాసుపాలు
న్యూఢిల్లీ: వివిధ రాష్ట్రాల్లో గవర్నర్ల తీరు మరోసారి వివాదాస్పదంగా మారింది. వారు మోడీ సర్కార్‌కు రాజకీయ ప్రతినిధిలుగా వ్యవహరిస్తున్నారని, ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాల్ని కూలదోయటమే లక్ష్యంగా పనిచేస్తున్నారని ఆరోపణలు బలంగా ఉన్నాయి. పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్కర్, అక్కడి మమతా బెనెర్జీ ప్రభుత్వానికి మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ధన్కర్ను రీకాల్ చేయాలని మమతా బెనెర్జీ డిమాండ్ చేస్తున్నారు. కొన్నాండ్ల క్రితం మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సమయంలో అక్కడి గవర్నర్ భగత్‌సింగ్ కొశ్యారీ పోషించిన పాత్ర..అత్యంత వివాదాస్పదమైంది. బీజేపీని అధికారంలోకి తీసుకురావటం కోసం ఆయన శతవిధాలా ప్రయత్నించారు. ఆయన చర్యల్ని అడ్డుకోవడానికి సుప్రీంకోర్టు రంగంలోకి దిగాల్సివచ్చింది.
ఢిల్లీ ఎల్జీ వర్సెస్ కేజ్రీ
ఇక ఢిల్లీ సంగతి..సరే..సరి. ప్రజల ఓట్లతో గెలిచిన కేజ్రీవాల్‌కు ఎలాంటి అధికారాలూ లేవు..ఢిల్లీలో నేనే అంతా..అని గవర్నర్ అనిల్ బైజాల్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. నిత్యం ప్రభుత్వ నిర్ణయాల్లో జోక్యం చేసుకోవటం, ప్రతి నిర్ణయాన్నీ అడ్డుకోవటం దేశమంతా చూసింది. ఫిబ్రవరి, 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అత్యంత దారుణంగా ఓడిపోయింది. రాజకీయంగా ఆప్‌ను ఏమీచేయలేక గవర్నర్ ద్వారా రాజకీయ ప్రతికారచర్యలకు కేంద్రం తెరలేపింది. కేజ్రీవాల్ ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయానికి తన అనుమతి ఉండాలని ఎల్జీ వ్యవహరించిన తీరు మీడియాలో చర్చనీయాంశమైంది. దీనిపై కేజ్రీవాల్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
ఆ కేసులో ఢిల్లీ ఎల్జీకి పరిమితమైన అధికారాలుమాత్రమే ఉన్నాయని సుప్రీం స్పష్టత ఇచ్చింది. అయినా కూడా ఢిల్లీలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడానికి బీజేపీ అనేక ప్రయత్నాలు చేసింది. ఇందులో ఢిల్లీ ఎల్జీ అనిల్ బైజాల్ ముఖ్యపాత్ర పోషించారు. మళ్లీ అదే తరహా చర్యలతో ప.బెంగాల్లో బీజేపీ రాజకీయ ఎత్తుగడలను అమలుజేస్తున్నదని రాజకీయ విశ్లేషకులు అంచనావేస్తున్నారు. అక్కడి గవర్నర్ ధన్కర్ మాటలు..ఆయన చేతలు..పత్రికల్లో పతాక శీర్షికలవుతున్నాయి.
అధికారం కోసం ఏమైనా..
ప్రతిపక్షాల పాలనలో ఉన్న రాష్ట్రాల్లో గవర్నర్ల ద్వారా రాజకీయ అలజడలు, ప్రతిష్టంభన సృష్టించటం మోడీ సర్కార్ అనుసరిస్తున్న వ్యూహం. ఆ సంక్షోభాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవటం, తాత్కాలికంగా అక్కడి ప్రభుత్వాన్ని ఇబ్బందులపాలుచేయటం కేంద్రం లక్ష్యం. ఇది మహారాష్ట్ర, గోవా, ఢిల్లీ, పుదుచ్చెరీ, పశ్చిమ బెంగాల్లో ప్రత్యక్ష్యంగా కనపడింది. మహారాష్ట్రంలో ప్రతిపక్షాలు (కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన) గట్టిగా నిలబడటంతో మోడీ సర్కార్ ఎత్తుగడలు ఫలించలేదు. బీజేపీ నాయకుడు ఫడ్నవీస్ రాజీనామా చేయక తప్పలేదు.
ఇలాంటి రాజకీయ కుట్రలు కేంద్రంలో కాంగ్రెస్ అధికారం ఉన్న సమయాన ఎన్నో జరిగాయి. 1984లో ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని గవర్నర్ ఠాకూర్ రామ్‌లాల్ డిస్మిస్ చేయటం అప్పుడు దేశవ్యాప్తంగా సంచలనమైంది. అదే ఏడాది జమ్మూకాశ్మీర్‌లో ఫరూక్ అబ్దుల్లా ప్రభుత్వాన్ని గవర్నర్ డిస్మిస్ చేశాడు. ఇప్పుడు మోడీ సర్కార్ కూడా వివిధ రాష్ట్రాల్లో ప్రజాస్వామ్య ప్రభుత్వాల్ని కూల్చడానికి కాంగ్రెస్ విధానాల్నే ఎంచుకుంది.
పుదుచ్చెరీలో ఇలాగే..
ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సర్వస్వతంత్రుడు కాదు...అని జులై, 2018లో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఇలాంటి తీర్పే ఏప్రిల్, 2019లో మద్రాస్ హైకోర్టు పుదుచ్చెరీ ఎల్జీ కిరణ్ బేడీ విషయంలోనూ ఇచ్చింది. అయినా పుదుచ్చెరీలో అధికార కాంగ్రెస్‌లో చీలిక తీసుకొచ్చి, తిరుగుబాటు ఎమ్మెల్యేలతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలనుకుంది. ఈ రాజకీయ కుట్రలో గవర్నర్ కిరణ్ బేడీ ప్రత్యక్షంగా పాలుపంచుకోవటం వివాదాస్పదమైంది.