Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : డిజిటల్ న్యూస్, సోషల్ మీడియాలపై నియంత్రణ విధించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఐటీ నిబంధనలపై స్టే విధించేందుకు ఢిల్లీ హైకోర్టు సోమవారం నిరాకరించింది. ప్రస్తుత దశలో అటువంటి ఉత్తరులను జారీచేసేందుకు పిటిషనర్ల వాదనతో ఏకీభవించలేమని పేర్కొంది. కొత్త ఐటీ రూల్స్‌పై స్టే విధించాలని కోరుతూ ఫౌండేషన్ ఆఫ్ ఇండిపెండెంట్ జర్నలిజం, ది వైర్, క్వింట్ డిజిటల్ మీడియా లిమిటెడ్, ప్రవ్దా మీడియా ఫౌండేషన్ సంస్థలు ఈ పిటిషన్ దాఖలు చేశాయి. కొత్త నిబంధనలు పాటించాలని, లేకుంటే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల తమకు నోటీసులు ఇచ్చిందని సంస్థలు పిటిషన్లో పేర్కొన్నాయి. దీనిపై జస్టిస్ సి.హరిశంకర్, సుబ్రహ్మణ్యం ప్రసాద్‌లతో కూడిన వెకేషన్ బెంచ్ విచారణ చేసింది. నోటిఫికేషన్‌ను అమలు చేయడం కోసం నోటీసులు జారీచేయబడ్డాయనీ, దీనిపై స్టే విధించ లేమని పేర్కొంది. '' మేము మీ వాదనతో ఏకీభవించలేము. మీరు కావాలనుకుంటే ఒక వివరణాత్మక ఉత్తర్వులు జారీ చేస్తాం. మీరు సూచ నలు తీసుకొని మాకు తెలియజేయండి'' అని పేర్కొంది. న్యూస్ పోర్టల్స్ తరపు సీనియర్ న్యాయవాది నిత్యా రామక్రిష్ణన్ స్పందిస్తూ.. సెలవుల తర్వాత కోర్టులు తిరిగి ప్రారంభమైన తర్వాత పిటిషన్‌ను జాబితా చేయాలని కోరారు. దీంతో కొత్త ఐటీ రూల్స్‌పై స్టే కోరుతూ వచ్చిన పిటిషన్లను కోర్టు జులై 7న రోస్టర్ బెంచ్ ముందు జాబితా చేసింది.