Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 1.1 లక్షల కోట్లతో రుణ హామీ
- ప్రకటించిన నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీ : కరోనా రెండో వెల్లువలో దెబ్బ తిన్న రంగాలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అరకొర ఉద్దీపనలు ప్రకటించారు. వైద్యం తదితర రంగాలకు రూ. 1.1 లక్షల కోట్ల రుణ హామీ ఇవ్వనున్నామన్నారు. వైద్య పర్యాటక రంగం పునరుజ్జీవానికి కొత్త పథకం ప్రకటించారు. విదేశాల నుంచి వచ్చే మొదటి 5 లక్షల మంది పర్యాటకులకు ఉచిత వీసా కల్పించనున్నారు. ఈ ఉచిత వీసా పథకం వచ్చే ఏడాది మార్చి 22 వరకే ఉంటుందన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం నాడిక్కడ విలేకరులతో మాట్లాడారు. ఈ రుణ హామీ పథకాన్ని రెండు భాగాలుగా విడగొట్టామనీ, వైద్య రంగానికి రూ.50 వేల కోట్లు, ఇతర రంగాలకు మిగతా రూ. 60వేల కోట్లు కేటాయించామని అన్నారు. ఆత్మ నిర్భర్ భారత్ కింద గత ఏడాది ప్రకటించిన రూ.1.5 లక్షల కోట్లు అదనమని తెలిపారు. ఈ కొత్త స్కీము కింద 25 లక్షల మంది చిన్న రుణ గ్రహీతలకు ఒక్కొక్కరికి రూ.1.25 లక్షల వరకు తక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వనున్నట్టు తెలిపారు. పర్యాటక రంగాన్ని ఆదుకునే చర్యల్లో భాగంగా ట్రావెల్ ఏజెన్సీలకు రూ.10 లక్షల వరకు, టూరిస్ట్ గైడ్లకు లక్ష రూపాయల వరకు రుణ సౌకర్యం కల్పిస్తామన్నారు. ఎనిమిది అంశాలకు ఈ రుణ హామీ వర్తిస్తుందని సీతారామన్ చెప్పారు. అయితే వీటిలో కొత్త అంశాలు నాలుగు మాత్రమే. మిగతావి గతంలో ఉన్నవే.
రానున్న యూపీ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆ రాష్ట్రంలో వైద్య సౌకర్యాల కల్పనకు రూ.50 వేల కోట్లు ప్రత్కేకంగా కేటాయించారు. అత్యవసర క్రెడిట్ లైన్ హామీ పథకం (ఈసీఎల్జీఎస్)పరిమితిని రూ.4.5 లక్షల కోట్లకు పెంచింది. వీటిపై వడ్డీ రేటు 8.25 శాతంగా నిర్ణయించింది.