Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పరీక్షించిన డిఆర్డిఓ
న్యూఢిల్లీ : అణు శీర్షాన్ని తీసుకెళ్లగల కొత్త తరం క్షిపణి అగ్ని పీ డీఆర్డీఓ విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని బాలాసోర్‌లో గల డాక్టర్ అబ్దుల్ కలామ్ సెంటర్ నుంచి బాలిస్టిక్ క్షిపణి అగ్ని-పీ (ప్రైమ్)ను సోమవారం ఉదయం 10.55గంటలకు ప్రయోగించారు. వెయ్యి కిలోమీటర్ల నుంచి రెండు వేల కిలోమీటర్ల మధ్యగల లక్ష్యాన్ని ఇది ఛేదిస్తుంది. అగ్ని శ్రేణికి చెందిన క్షిపణుల్లో ఇది మరింత అధునాతమైనదని డీఆర్డీఓ ఒక ప్రకటనలో పేర్కొంది. క్షిపణి ట్రాక్‌ను తూర్పు తీరం పొడవునా వివిధ టెలిమెట్రి, రాడార్ స్టేషన్లు పర్యవేక్షించాయని ఆ ప్రకటన తెలిపింది. అత్యంత కచ్చితమైన రీతిలో అన్ని లక్ష్యాలను ఈ క్షిపణి పరిపూర్తి చేసిందని పేర్కొంది. క్షిపణులను కేనిస్టర్ (డబ్బా)లో అమర్చడం వల్ల ప్రయోగ సమయం తగ్గుతుంది. వీటిని నిల్వచేసుకునే, తరలించే సామర్ధ్యం మెరుగవుతుందని రక్షణాధికారి వివరించారు. అగ్ని-పీ క్షిపణి ఈ తరహాకు చెందిందే. భారతదేశానికి గల అణ్వాయుధ ప్రయోగ సామర్ధ్యంలో అగ్ని వర్గానికి చెందిన క్షిపణులు చాలా కీలకమైనవి. ఇప్పటికే ఈ విభాగంలో పలు రకాలైన క్షిపణులను విజయవంతంగా పరీక్షించారు.