Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రానికి తమిళనాడు సీఎం స్టాలిన్ లేఖ
చెన్నై : ఇప్పటివరకు రాష్ట్రాలకు కేటాయించిన వ్యాక్సిన్ డోసుల పరిస్థితిపై సమీక్షించి, ప్రభుత్వాలకు కేటాయింపును పెంచాల్సిందిగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ కోరారు. ఈ మేరకు సోమవారం కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రికి లేఖ రాశారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వాలకు, ప్రయివేటు సంస్థలకు 75:25 నిష్పత్తిలో డోసులు కేటాయిస్తున్నారని, దాన్ని 90:10గా సవరించాల్సిందిగా కోరారు. అందుబాటులో వున్న వ్యాక్సిన్లను తక్కువ సమయంలోనే ఉత్తమ రీతిలో వినియోగించేందుకు వీలుగా తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఇప్పటివరకు ప్రతి వెయ్యి మందికి ఎన్ని డోసులు కేటాయించారో ఒక్కసారి ప్రభుత్వం సమీక్షించుకోవాలని పేర్కొన్నారు. తలసరి డోసుల సంఖ్య తక్కువగా వున్నందున వెంటనే అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ మేరకు లేఖ ప్రతిని మీడియాకు అందజేశారు. ఇప్పటివరకు ప్రయివేటు సంస్థలు వేసిన వ్యాక్సిన్ల శాతంతో పోల్చుకుంటే వాటికి కేటాయించిన వ్యాక్సిన్లు చాలా ఎక్కువగా వున్నాయనీ, అందువల్ల ప్రభుత్వం ఈ విషయంలో పునరాలోచించాలని ముఖ్యమంత్రి స్టాలిన్ కోరారు. తమిళనాడులో మొత్తంగా కోటీ 43లక్షల డోసులు వేయగా, అందులో ప్రయివేటు ఆస్పత్రులు వేసినవి ఆరున్నర లక్షలుగా వున్నాయని చెప్పారు. అంటే 4.5శాతం మాత్రమే వేశారు. జూన్‌లో రాష్ట్రవ్యాప్తంగా 43.5 లక్షల డోసులు వేయగా, అందులో ప్రయివేటు ఆస్పత్రుల వాటా 10శాతంగా అంటే నాలుగున్నర లక్షలుగా వున్నదని తెలిపారు. ప్రభుత్వ, ప్రయివేటు సంస్థల మధ్య డిమాండ్‌కు, సరఫరాకు చాలా తీవ్ర స్థాయిలో అంతరం వుందని అన్నారు. ప్రస్తుతం తమిళనాడులో ప్రయివేటు ఆస్పత్రుల వద్ద 7నుంచి 8లక్షల డోసుల వరకు ఉన్నాయనీ, అంటే వీటిని ఉపయోగించుకోవడానికి నెలరోజులు సరిపోతాయని అన్నారు. ప్రభుత్వం వద్ద రెండు లక్షల డోసులే వున్నాయన్నారు. ఇవి ఒక రోజు ఉపయోగించాల్సిన మొత్తం కన్నా తక్కువేనని తెలిపారు. ప్రభుత్వానికి మరింత హేతుబద్ధమైన రీతిలో, పనితీరు ప్రాతిపదికగా వ్యాక్సిన్ల పంపిణీ జరిగితేనే దీన్ని సరిదిద్దుకోవడానికి వీలవుతుందని తెలిపారు.