Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు శ్రీ మంత్రుల ఇండ్ల ముట్టడికి యత్నం, అరెస్టులు
- ప్రభుత్వం స్పందించకపోతే 30న సీిఎం ఇంటిని ముట్టడిస్తాం : ఏపీ ఉద్యోగ పోరాట సమితి నాయకులు
విజయవాడ : రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగ, విద్యార్థి, యువజన సంఘాలతో ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ పోరాట సమితి ఆధ్వర్యాన నిరుద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం పెద్ద ఎత్తున కదంతొక్కారు. మంత్రుల ఇళ్ల ముట్టడికి ప్రయత్నించారు. అనేక జిల్లాల్లో పోలీసులు ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ నాయకులను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా పెనుగులాట, తోపులాట చోటు చేసుకు న్నాయి. కొన్ని జిల్లాల్లో ముందస్తు అరెస్టులు, గృహ నిర్బంధానికి పోలీసులు పాల్పడ్డారు. అరెస్టు చేసిన వారందరినీ ఆ తర్వాత విడుదల చేశారు. అరకొర జాబ్‌లతో విడుదల చేసిన జాబ్ కేలండర్ స్థానే కొత్త జాబ్ కేలండర్ విడుదల చేసే వరకూ పోరాటం కొనసాగుతుందని నాయకులు తేల్చి చెప్పారు. ప్రభు త్వం దిగిరాకపోతే నిరుద్యోగులతో కలిసి ఈ నెల 30న ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ముట్ట డిస్తామని హెచ్చరించారు. అరెస్టులను ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ పోరాట సమితి కమిటీ తీవ్రంగా ఖండిం చింది.
ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ పోరాట సమితి ఆధ్వర్యాన విజయవాడలోని ధర్నా చౌక్‌లో మహాధర్నా జరిగింది. సమితి నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న రెండు లక్షల పోస్టులను భర్తీ చేస్తానని, ఏటా జనవరిలో జాబ్ కేలండర్ విడుదల చేస్తానని, ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తానని గత ఎన్నికల ముందు వైఎస్.జగన్మోహన్రెడ్డి ఇచ్చి మాటను నిలుపుకోవాలని డిమాండ్ చేశారు. 10,143 పోస్టులకు మాత్రమే జాబ్ కేలండర్ ప్రకటించి మాట తప్పడం, మడమ తిప్పడం సరికాదన్నారు. పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న 6,500 పోస్టులను జాబ్ కేలండర్లో చేర్చాలని డిమాండ్ చేశారు. 25 వేల పోస్టులతో మెగా డిఎస్సి, ఐదు వేల పోస్టులతో గ్రూప్-1, 2 నోటిఫికేషన్, ఇంజినీరింగ్, లైబ్రరీ సైన్సు, ఇతర ఖాళీ పోస్టులతో నూతన జాబ్ కేలండర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు వయోపరిమితిని 47 ఏళ్లకు పెంచాలని కోరారు. డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు జి రామన్న అధ్యక్షతన జరిగిన ఈ మహాధర్నాలో రాష్ట్ర కార్యదర్శి ఎం.సూర్యారావు, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఎ.అశోక్, ఎఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు లెనిన్, ఎఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు సుబ్బారావు, పిడిఎస్యు నాయకులు రామకృష్ణ, రవిచంద్ర, టిఎన్ఎస్ఎఫ్ నాయకులు శ్రవణ్ కుమార్ తదితరులు ప్రసంగించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం కలెక్టరేట్ ధర్నా చౌక్ వద్ద డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యాన నిరుద్యోగులు ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా అధికారులకు వినతిపత్రం ఇచ్చేందుకు ర్యాలీగా కలెక్టరేట్‌కు వెళ్తుండగా నాయకులను పోలీసులు అడ్డుకొని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. విశాఖ సీతమ్మధారలోని రాష్ట్ర మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఇంటి ముట్టడికి ప్రదర్శనగా వెళ్తున్న నాయకులను, నిరుద్యోగులను పోలీసులు 34 మందిని అరెస్టు చేసి ఎంవిపి పోలీస్ స్టేషన్ తరలించారు. గుంటూరులో చేపట్టిన 'చలో కలెక్టరేట్'పై రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధం ప్రయోగిం చింది. కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు, సిపిఎం తూర్పు గుంటూరు జిల్లా కార్యదర్శి పాశం రామారావు సహా వివిధ యువజన, విద్యార్థి సంఘాల జిల్లా నాయకులను, నిరుద్యోగులను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. రోడ్లపై కనిపించిన యువకులను ప్రతి ఒకరినీ ఆపి, ప్రశ్నించి భయబ్రాంతులకు గురి చేశారు. పోలీసుల నిర్బంధాన్ని అధిగమించి వివిధ సంఘాల నాయకులు కలెక్టరేట్ గేటు వద్దకు చేరుకునే ప్రయత్నం చేయగా, వారినీ అరెస్ట్ చేశారు. విజయనగరంలో ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ ఆధ్వర్యాన నిరుద్యోగులు రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ ఇంటికి ర్యాలీగా వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. రోడ్డుపై ఈడ్చుకుపోయి అరెస్టు చేశారు. నిరుద్యోగుల కాళ్లు, చేతులు పట్టుకొని వ్యాన్లలోకి విసిరేశారు. మొత్తం 28 మందిని అరెస్టు పోలీసు స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశారు. అనంతరం రాత్రి 7.30 గంటల సమయంలో స్టేషన్ బెయిల్‌పై వారిని విడుదల చేశారు.
చిత్తూరు జిల్లా తిరుపతిలోని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ఇంటికి ర్యాలీగా వెళ్తున్న విద్యార్థులను, నాయకులను పోలీసులు అడ్డుకొని అమానుషంగా ప్రవర్తించారు. రోడ్డుపై ఈడుస్తూ, కాళ్లతో తన్నుతూ తీసుకెళ్లి బలవంతంగా వ్యాన్‌లో ఎక్కించి పోలీసు స్టేషన్‌కు తరలించి అక్రమ కేసులు బనాయించారు. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ఇంటిని ముట్టడించిన విద్యార్థి, యువజన సంఘం నాయకులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. కర్నూలులో జిల్లా ఇంఛార్జి మంత్రి అనిల్‌కుమార్ యాదవ్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు ర్యాలీగా వెళ్తున్న వారిలో 25 మందిని బిర్లా గేట్ వద్ద, 40 మందిని కలెక్టరేట్ వద్ద పోలీసులు అరెస్టు చేశారు. నంద్యాలలో సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద అర్ధనగ ప్రదర్శన నిర్వహించారు. ఆదోనిలో ఆర్‌డిఒ కార్యాలయం ముందు ప్లకార్డులతో నిరసన తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా చింతూరులో ఎర్రంపేట రహదారిపై ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ ఆధ్వర్యాన ప్లకార్డులతో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కె.ప్రసన్నకుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ కేలండర్ జాబ్ లెస్ కేలండర్‌లా ఉందని విమర్శించారు. రాజమహేంద్రవరంలో సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ప్లకార్డులతో ఆందోళన చేపట్టారు. నెల్లూరులో ఫూలే విగ్రహం ఎదుట మోకాళ్లపై నిల్చొని నిరసన తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని ఇంటిని ముట్టడించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టరేట్ నిరసన తెలిపారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ జంక్షన్‌లోగల అంబేద్కర్ విగ్రహం వద్ద అర్ధనగంగా ధర్నా నిర్వహించారు. ట్రాఫిక్ నిలిచిపోవడంతో పది మందిని నాయకులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.