Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పసిడిని విడిపించుకోలేని స్థితిలో కుటుంబాలు
- ఆదాయాలు లేక ఇబ్బందులు
న్యూఢిల్లీ : అనేక కుటుంబాలు ఎంతో కాలం కష్టపడి ప్రతీ రూపాయి పొదుపు చేసుకుని ఎన్నో ఆశలు.. ఎంతో మురిపంతో కొనుగోలు చేసిన బంగారు అభరణాలు ఇప్పుడు వేలానికి వస్తున్నాయి. గడిచిన కొన్ని నెలలుగా పత్రికల్లో బంగారం తనఖా ప్రకటనలు భారీగా పెరుగుతుండటమే ఇందుకు నిదర్శనం. అప్పులు చెల్లించలేని ఖాతాదారుల అభరణాలను ఇది వరకు ఎప్పుడూ లేని స్థాయిలో విత్త సంస్థలు వేలం వేస్తున్నాయి. కరోనా, లాక్డౌన్ నిబంధనలతో అనేక భారతీయ కుటుంబాలు తీవ్ర ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నాయి. ఉపాధి లేకపోవడంతో పలు అవసరాల కోసం తమ వద్ద ఉన్న బంగారాన్ని తనఖాగా పెట్టుకొని అప్పులు తీసుకుంటున్నారు. ఇప్పటికే భారీగా ఉద్యోగాలు పోయాయి. కరోనా రెండో దశ కొంత తగ్గుముఖం పట్టినప్పటికీ ప్రభుత్వ చర్యల వల్ల ఇప్పటికీ ఉపాధి కల్పనలో పెద్ద పురోగతి లేకపోవడం వల్ల తీసుకున్న అప్పులు చెల్లించలేని దుస్థితిలో అనేక కుంటుంబాలు చిక్కుకున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. దీంతో బంగారాన్ని పూచీగా పెట్టుకుని అప్పులిచ్చిన విత్త సంస్థలు గడవు తీరగానే వేలం వేస్తున్నాయి.
బంగారం తనఖా సెగ్మెంట్లోని ప్రముఖ బ్యాంకింగేతర విత్త సంస్థ మణప్పుర ఫైనాన్స్ గడిచిన జనవరి - మార్చి కాలంలోనే ఏకంగా రూ.404 కోట్ల బంగారాన్ని వేలం వేసింది. 2020 ఏప్రిల్ - డిసెంబర్ తొమ్మిది మాసాల కాలంలో కేవలం రూ.8 కోట్ల విలువ చేసే పసిడిని వేలం వేసింది. దీంతో పోల్చితే ఇటీవల కుటుంబాల పరిస్థితి చాలా దారుణమైన స్థితిలోకి జారాయని స్పష్టం అవుతుంది. మరో సంస్థ ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ కూడా 2021 జనవరి- మార్చి కాలంలో తన మొత్తం రుణ పుస్తకంలోని 1.8 శాతం పసిడి తనఖాలను వేలం వేసింది. ఇంతక్రితం 2020 డిసెంబర్ త్రైమాసికంలో ఇది 0.23 శాతంగా, సెప్టెంబర్ త్రైమాసికంలో 0.04 శాతంగా ఉంది.