Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మేవాట్‌లో కిసాన్ మహా సమ్మేళన్
- మత సామరస్యాన్ని కాపాడాలి : ఎస్కేఎం నేతలు
- రైతు ఉద్యమంలో 526 మంది రైతులు వీర మరణం
- కొనసాగుతున్న అన్నదాతల ఆందోళనలు
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా రైతుల ఉద్యమం కొనసాగుతున్నది. ఢిల్లీ సరిహద్దుల్లో జరుగుతున్న ఉద్యమానికి సంఘీభావంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ మేరకు సోమవారం మతసామరస్యం కోసం సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) నేతృత్వంలో భారీ కిసాన్ మజ్దూర్ భైచారా మహా సమ్మేళన్ జరిగింది. హర్యానా, రాజస్థాన్ సరిహద్దుల్లోని మేవాట్ ప్రాంతంలో సునేహ్దా సరిహద్దు వద్ద వేలాది మంది రైతులు కదంతొక్కారు. హిందూ, ముస్లిం, సిక్కు మతాలకు చెందిన వేలాది మంది రైతుల సమీకరణ జరిగింది. ఇందులో పెద్ద సంఖ్యలో మహిళా రైతులు పాల్గొనటం విశేషం. మేవాట్ ప్రాంతమైన హర్యానాలోని నుV్‌ా, రాజస్థాన్‌లోని అల్వార్, భరత్పూర్, ఉత్తరప్రదేశ్‌లోని మధురల నుంచి ఎక్కువ మంది ముస్లిం రైతులు పాల్గొన్నారు.
ఈ ప్రాంతంలో ఇటీవల జరిగిన రెండు విషాద ఘటనల నేపథ్యంలో ఈ మహా సమ్మేళన్ జరిగింది. స్థానికుల మధ్య జరిగిన గొడవలో యువకుడు ఆసిఫ్ హత్యకు గురయ్యాడు. ఆర్ఎస్ఎస్, బీజేపీ కార్యకర్తలు దీనిని తప్పుదోవపట్టించి మతంరంగు పులిమేందుకు ప్రయత్నించారు. కొనసాగుతున్న రైతుల ఐక్య పోరాటాన్ని దెబ్బతీసేందుకు, నేరస్థులకు మద్దతుగా ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. అలాగే పోలీసు స్టేషన్లో దారుణంగా కొట్టిన తరువాత మరో యువకుడు జునైద్ హత్యకు గురైన సంఘటన. దీనికి వ్యతిరేకంగా నిరసనలు జరిగిన అనంతరం.. పోలీసులపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ ఘటన నేపథ్యంలో బీజేపీ, జేజేపీ నేతృత్వంలోని హర్యానా సర్కార్ చాలా మంది రైతులపై కేసులు నమోదుచేయించింది, అరెస్టులు చేయించింది.
ఈ రెండు ఘటనల నేపథ్యంలోనే... మత ఉద్రిక్తతలను రెచ్చగొట్టే చర్యలకు వ్యతిరేకంగా మతతత్వ సామరస్యాన్ని, స్నేహాన్ని పాదుకొల్పేందుకు ఈ మహా సమ్మేళనం జరిగింది. దీనికి ఎస్కేఎం నేత డాక్టర్ దర్శన్ పాల్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మహా సమ్మేళనాన్ని ఉద్దేశించి ఎస్కేఎం నాయకులు గుర్నమ్ సింగ్ చారుని, యోగేంద్ర యాదవ్,డాక్టర్ అశోక్ ధావలే, జగ్జిత్ సింగ్ దల్లెవాల్, అభిమన్యు కోహర్, ఇంద్రజీత్ సింగ్, సుదేష్ కౌర్ దుహాన్, జగ్జిత్ కౌర్ పన్నూ తదితరులు ప్రసంగించారు. మోడీ, షా, అంబానీ, అదానీల ద్వయంపై తీవ్ర విమర్శలు చేశారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ 'డివైడ్ అండ్ రూల్ (విభజించు పాలిం చు)' విధానానికి వ్యతిరేకంగా విమర్శలు గుప్పించారు. వ్యవసాయాన్ని కాపాడాలి...ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలనే నినాదంతో జూన్ 26న దేశంలో జరిగిన ప్రదర్శనల్లో లక్ష లాది మంది శ్రామిక ప్రజలు పాల్గొనడాన్ని ప్రశంసించారు. దేశంలో మత సామరస్యాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ మహా సమ్మేళనంలో ఎఐకేఎస్ కోశాధికారి పి. కష్ణ ప్రసాద్, ఎఐకేఎస్ నేత మనోజ్ పాల్గొన్నారు.
ఉద్యమంలో 526 మంది రైతుల వీర మరణం
2020 నవంబర్ 24 నుంచి 2021 జూన్ 27 వరకు రైతు ఉద్యమంలో 526 మంది రైతులు వీరమరణం పొందారు.అలాగే వారి త్యాగాలను స్మరించుకుంటూ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తామని రైతు నాయకులు స్పష్టం చేశారు.
కొనసాగుతున్న రైతు ఆందోళన
మూడు రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలనీ, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో జరుగుతున్న రైతుల ఉద్యమం ఉధృతంగా కొనసాగుతున్నది. ఆందోళనల్లో భాగస్వామ్యం అయ్యేందుకు భారీగా అన్నదాతల కదులుతున్నారు. వివిధ రాష్ట్రాల నుండి వేలాది మంది రైతులు సరిహద్దులకు చేరు కుంటున్నారు. గత కొన్ని రోజులుగా ప్రతిరోజూ భారీగా రైతులు సరిహద్దులకు చేరుకుంటున్నారు. రైతు ఉద్యమం సోమవారం నాటికి 214వ రోజుకు చేరింది. సింఘూ, టిక్రీ, ఘాజీపూర్, షాజాహన్‌పూర్, పల్వాల్ సరిహద్దులవద్ద ఆందో ళనల్లో వందలాది మంది రైతుల భాగస్వామ్యమవుతున్నారు.