Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యాంటీబాడీలు వృద్ధి.. వారిలో 10-14 ఏండ్ల అధికం : సీరో సర్వే
ముంబయిం : దేశ ఆర్ధిక రాజధాని ముంబయిలో కరోనా ప్రభావం ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా అక్కడ జరిపిన సీరో సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. ముంబయిలో 50 శాతం మంది పిల్లలు కరోనా బారినపడటంతో పాటు వీరిలో యాంటీబాడీలు వృద్ధి చెందాయని ఈ సర్వే ద్వారా తెలిసింది. బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) పరిధిలో కొన్ని ప్రాంతాల్లో బీవైఎల్ నాయర్ ఆస్పత్రి, కస్తూర్బా మాలిక్యులార్ డయోగ్నోస్టిక్ ల్యాబ్ సంయుక్తంగా సీరో సర్వే నిర్వహించాయి. నగరంలోని మొత్తం 24 వార్డుల్లో సర్వే చేశారు. 18 ఏండ్ల లోపు పిల్లల్లో మొత్తం 10 వేల నమూనాలను సేకరించారు. ఈ వర్గంలో మొత్తం 51.18 శాతం సీరో పాజిటివిటీ ఉన్నట్టు గుర్తించారు. అత్యధికంగా 10-14 ఏండ్ల మధ్య వయస్సు గల వారిలో 53.43 శాతం సీరోపాజిటివిటీ ఉన్నట్టు కనుగొన్నారు. ఇక 1-4 ఏండ్ల వారిలో 51.04 శాతం, 5-9 ఏండ్ల వారిలో 47.33 శాతం, 10-14 ఏండ్ల వారిలో 53.43 శాతం, 15-18 ఏండ్ల వారిలో 51.39 శాతం సీరోపాజిటివిటీ ఉందని బీఎంసీ వెల్లడించింది. ఈ సర్వేను ఏప్రిల్ 1 నుంచి జూన్ 15 వరకు నిర్వహించామని తెలిపింది. మార్చిలో నిర్వహించిన మూడో సీరో సర్వేతో పోలిస్తే ప్రస్తుతం పిల్లల్లో సీరో పాజిటివిటీ పెరిగినట్టు బీఎంసీ పేర్కొంది. గతంలో నిర్వహించిన సర్వేలో 39.4 శాతం మందిలో సీరో పాజిటివిటీ ఉన్నట్టు గుర్తించినట్టు తెలిపింది.