Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉద్దీపన ప్యాకేజీపై కె.నాగేశ్వర్
- ప్రయివేటు హాస్పిటల్ యాజమాన్యాలకు చౌక రుణాలు ..
- ప్రభుత్వ వైద్యరంగానికి కోతలు
న్యూఢిల్లీ : కరోనా రెండో వేవ్ కారణంగా ఏర్పడిన ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీపై ఆర్థిక, రాజకీయ విశ్లేషకులు పెదవి విరిస్తున్నారు. తాజాగా ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీ రూ.6.29లక్షల కోట్లలో అధికభాగం ఇంతకు ముందు కేంద్రం ప్రకటించిన పథకాలే ఉన్నాయని రాజకీయ విశ్లేషకుడు కె.నాగేశ్వర్ విమర్శించారు. ప్రజల కొనుగోలు శక్తి పెంచే ఉపశమన చర్యలేవీ ఈ ఉద్దీపన ప్యాకేజీలే లేవని ఆయన అన్నారు.
ఉదాహరణకు 5 కిలోల ఆహార ధాన్యం ఉచిత పంపిణీ కోసం కేటాయించిన రూ.2.27లక్షల కోట్లు తాజా ప్యాకేజీలో చూపారని ఆయన చెప్పారు. రేటింగ్ ఏజెన్సీ ఐసీఆర్ఏ తాజా నివేదిక ప్రకారం, కేంద్ర ప్రభుత్వ వ్యయంలో పెరుగుదల రూ.60 వేల కోట్లు మాత్రమే ఉందని అంచనావేసింది. దీని ప్రకారం ప్రభుత్వ వ్యయంలో పెరుగుదల దేశ జీడీపీలో కేవలం 0.3శాతం మాత్రమేనని నాగేశ్వర్ చెప్పారు.
ప్రయివేటుకు భారీ రుణాలు
ప్రయివేటురంగంలో వైద్య సదుపాయాల మెరుగుదల కోసం రూ.50వేల కోట్లు రుణాలుగా ఇస్తామని కేంద్రం ప్రకటించింది. ప్రయివేటు హాస్పిటల్ యాజమాన్యాలు గరిష్టంగా రూ.100కోట్లు రుణంగా పొందేందుకు అవకాశం కల్పించారు. ఈ రుణాలకు వడ్డీ 7.95శాతం నిర్ణయించారు. దీనివల్ల ప్రయివేటు హాస్పిటల్ యాజమాన్యాలు లబ్ది పొందుతాయని నాగేశ్వర్ అన్నారు. వైద్యరంగంలో ప్రభుత్వ వ్యయం గణనీయంగా తగ్గటం ఖాయమని ఆయన అంచనావేశారు. ప్రస్తుత బడ్జెట్లో ఆరోగ్య, కుటుంబ సంక్షేమానికి కేంద్ర బడ్జెట్లో రూ.71,269కోట్లు కేటాయించారు. గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే నిధుల వ్యయంలో 7,597కోట్లు కోతపెట్టారు. ఆరోగ్యరంగంలో పెట్టుబడి వ్యయం రూ.1724కోట్లు తగ్గింది. ఉద్దీపన ప్యాకేజీ అంతా కూడా బ్యాంకు రుణాల మంజూరుతో కూడుకున్నది. అంతే తప్ప ప్రభుత్వ వ్యయంలో పెరుగుదల లేదని నాగేశ్వర్ విమర్శించారు.