Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెట్రోల్‌పై 35 పైసలు, డీజిల్‌పై 31 పైసల పెంపు
- సైకిల్ పై వెళ్లలేమా అంటూ బీజేపీ మంత్రి వ్యాఖ్యలు
న్యూఢిల్లీ : దేశంలో చమురు ధరలు వాహనదారుల నడ్డి విరుస్తున్నాయి. ఇంధన ధరలకు తోడు నిత్యావసరాల ధరలు సైతం ఆకాశమే హద్దుగా పెరుగుతుంటంతో సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. వరుసగా మూడో రోజు సైతం చమురు ధరలను ఫ్యూయల్ రిటైల్ కంపెనీలు పెంచాయి. లీటరు పెట్రోల్‌పై 35 పైసలు, లీటరు డీజిల్ పై 31 పైసలు పెరిగింది. ఇప్పటికే రికార్డు స్థాయికి చేరిన ఇంధన ధరలు తాజా పెంపుతో దేశరాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.98.81, డీజిల్ ధర రూ.89.18కు పెరిగింది. అలాగే, దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో పెట్రోల్ ధరలు కొత్త రికార్డులు తిరగరాస్తున్నాయి. ప్రస్తుతం లీటరు పెట్రోల్ ధర రూ.104.90కి పెరుగగా, డీజిల్ ధర 96.72కు చేరింది.ఇదిలావుండగా.. గత నెల నుంచి ఇప్పటి వరకు 33 సార్లు చమురు ధరలు పెరిగాయి. ఈ సమయంలో లీటర్ పెట్రోల్‌పై రూ.8.49, డీజిల్‌పై రూ.8.39 పెరిగింది. దేశంలో అత్యధికంగా రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.110.04, డీజిల్ రూ.102.42కు పెరిగింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. దేశంలోని వివిధ నగరాల్లో చమురు ధరలు గమనిస్తే.. హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.102.69, డీజిల్ రూ.97.20, చెన్నైలో పెట్రోల్ రూ.99.80, డీజిల్ రూ.93.72, కోల్‌కతాలో పెట్రోల్ రూ.98.64, డీజిల్ రూ.92.03, విజయవాడలో పెట్రోల్ రూ.104.58, డీజిల్ రూ.98.52గా ఉంది.దేశంలో చమురు ధరల పెంపుతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతుండగా.. బీజేపీ నేతలు ధరల పెరుగుదల ప్రజల సంక్షేమ పథకాల కోసమేనంటూ వ్యాఖ్యానిస్తున్నారు.
భోపాల్‌లో మంగళవారం లీటర్ పెట్రోల్ రూ.107 దాటగా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి ప్రద్యుమన్ సింగ్ తోమర్ మాట్లాడుతూ.. పెట్రోల్ వాడకం తగ్గిస్తూ కూరగాయల మార్కెట్‌కు సైకిల్‌పై వెళ్లలేమా అని ప్రశ్నించారు. ఇలా చేస్తే మనం ఆరోగ్యంగా ఉండటంతో పాటు కాలుష్యానికి దూరంగా ఉండవచ్చని ఆయన పేర్కొన్నారు.