Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: 2021 సంవత్సరానికి ఫుక్యోకా బహుమతి పొందిన ముగ్గురిలో ప్రముఖ జర్నలిస్ట్ పాలగుమ్మి సాయినాథ్ ఒకరిగా ఎంపికయ్యారు. 'గ్రాండ్‌ప్రైజ్' కేటగిరీలో త్వరలో ఆయన ఈ అవార్డు అందుకోనున్నారు. ఇక అకడమిక్ ప్రైజ్, ఆర్ట్స్ అండ్ కల్చర్ ప్రైజ్ కేటగిరీలో వరుసగా జపాన్‌కు చెందిన ప్రొఫెసర్ కిషిమోటో మియో, థారులాండ్‌కు చెందిన సినీ నిర్మాత ప్రబ్దా యూన్ ఎంపికయ్యారు. ఈ మేరకు ఫుక్యోకా ప్రైజ్ కమిటీ సెక్రటేరియట్ తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది. ఫుక్యోకా అవార్డును అందుకునేందుకు సాయినాథ్ అత్యంత అర్హుడని పేర్కొంది. గ్రామీణ భారతంపై తన రచనలు, వ్యాఖ్యానాల ద్వారా, పౌర సహకారాన్ని ప్రోత్సహించడం ద్వారా కొత్త తరహా జ్ఞానాన్ని సృష్టించేందుకు కృషి చేశారని ప్రశంసించింది. ఆసియా సంస్కృతిని పరిరక్షించడం, అవగాహన పెంచడం, ఆసియా ప్రజల్లో పరస్పర మార్పిడి, లెర్నింగ్‌కు సంబంధించిన విస్తృత ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించేందుకు కృషిచేసిన విశిష్ట వ్యక్తులకు ఈ ఫుక్యోకా అవార్డు ఇస్తారు. ఈ అవార్డును అందుకున్న వారిలో బంగ్లాదేశ్‌కు చెందిన మహ్మద్ యూనస్, ప్రముఖ చరిత్రకారులు రొమిల్లా థాపర్, సరోద్ మ్యాస్ట్రో అంజద్ ఆలీఖాన్‌లకు ఈ అవార్డు లభించింది. ఇప్పటి వరకు 11 మంది భారతీయులు ఈ అవార్డు పొందారు. ఈ అవార్డును 1990లో ప్రారంభించగా, గత 30 ఏళ్ల కాలంలో 28 దేశాలకు చెందిన 115 మంది అవార్డు అందుకున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 29న అవార్డుల ప్రదానోత్సవాన్ని ఆన్లైన్ ద్వారా నిర్వహించనున్నారు.