Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
- వన్ నేషన్ - వన్ రేషన్‌ను అన్ని రాష్ట్రాల్లో అమలుచేయాలని ఆదేశం
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా అసంఘటితరంగ, వలసకార్మికుల పట్ల కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. కేంద్ర ప్రభుత్వ ఉదాసీనత క్షమించరానిదని జస్టిస్ అశోక్‌భూషణ్, జస్టిస్ ఎంఆర్ షాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. అసంఘటిత రంగ కార్మికులు, వలసకార్మికుల సమాచార నమోదు ప్రక్రియ ఎందుకు ఆలస్యమైందని, ఈ వ్యవహారంలో మీ వైఖరి క్షమార్హం కాదంటూ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖకు అక్షింతలువేసింది. వలస కార్మికుల ఆందోళనలను మీరు పట్టించుకోవటంలేదని, మీ వైఖరి ఆమోదయోగ్యం కాదని తెలిపింది. అసంఘటిత రంగం, వలసకార్మికులను నమోదు చేయడానికి వెంటనే ఒక పోర్టల్‌ను ప్రారంభించాలనీ, జులై 31వ తేదీ నాటికి ఈ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించింది. అవసరమైతే నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ సహకారాన్ని తీసుకోవాలని సూచించింది. అలాగే ''వన్ నేషన్ -వన్ రేషన్ పథకం'' అమలుకోసం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు అదనంగా ఆహారధాన్యాలను అందించాల్సిందిగా కేంద్రానికి సూచించింది. ''వన్ నేషన్, వన్ రేషన్'' పథకానికి రేషన్కార్టు దారులంతా అర్హులేననీ, వారంతా జాతీయ ఆహార భద్రత చట్టం (ఎన్ఎఫ్ఎస్ఏ) పరిధిలోకి వస్తారని తెలిపింది. వారు దేశంలో ఎక్కడనుంచైనా రేషన్ పొందేందుకు అర్హులని సుప్రీంకోర్టు పేర్కొంది. వలసకార్మికులకు రేషన్ అందించేందుకు రాష్ట్రాలు వెంటనే ఈ పథకాన్ని అమలు చేయాలని తెలిపింది. దీనికి జులై 31ని డెడ్‌లైన్‌గా పేర్కొంది. ఆ తేదీలోగా పథకం అమలు, అందుకు సంబంధించిన సమాచార సేకరణ జరగాలని కోర్టు ఆదేశించింది. వలసకార్మికుల కోసం కమ్యూనిటీ కిచెన్లను కూడా అందుబాటులోకి తీసుకురావాలని సూచించింది. కార్మికుల నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలంటూ గత నెల 24న సుప్రీంకోర్టు కేంద్రానికి చీవాట్లు పెట్టిన సంగతి తెలిసిందే.