Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యుత్ ఉద్యోగుల విభజన కేసులో..
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
విద్యుత్ ఉద్యోగుల విభజనలో తెలంగాణ విద్యుత్ సంస్థల సీఎమ్‌డీలకు సుప్రీంకోర్టు కోర్టు ధిక్కార నోటీసులు ఇచ్చింది. టీఎస్జెన్కో, ట్రాన్స్‌కో, టీఎస్ఎన్పీడీసీఎల్, టీఎస్ఎన్పీడీసీఎల్ సంస్థల సీఎమ్‌డీలు దేవులపల్లి ప్రభాకరరావు, జి రఘుమారెడ్డి, ఏ గోపాలరావు ఈ నోటీసులు అందుకున్నారు. జస్టిస్ ధర్మాధికారి ఏకసభ్య కమిటీ నివేదిక ప్రకారం 1,310 మంది విద్యుత్ ఉద్యోగుల్లో రెండు రాష్ట్రాలకూ చెరో 50 శాతం మందిని సర్దుబాటు చేసింది. ఈ నివేదిక ప్రకారం 655 మందిని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థలు విధుల్లో చేర్చుకున్నాయి. తెలంగాణ విద్యుత్ సంస్థలు మాత్రం 84 మందిని మినహాయించి, మిగిలిన వారిని విధుల్లోకి తీసుకున్నాయి. తమను కూడా విధుల్లోకి తీసుకోవాలని 84 మంది ఏపీ ఉద్యోగులు తెలంగాణ విద్యుత్ సంస్థల యాజమాన్యాలను కోరారు. ఏడు నెలలు గడిచినా వారిని విధుల్లోకి తీసుకోలేదు. ఈ 84 మందిని ఏపీ విద్యుత్ సంస్థలు విధుల నుంచి తప్పించి, తెలంగాణ కేడర్‌కు అప్పగించినట్లు సుప్రీంకోర్టుకు తెలిపాయి. వీరికి ఏడు నెలలుగా రెండు రాష్ట్రాల విద్యుత్ సంస్థలు జీతాలు కూడా చెల్లించట్లేదు. ఈ నేపథ్యంలో వారు మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ ధర్మాధికారి కమిటీ నివేదికను అమలు చేయట్లేదనీ, తమను తెలంగాణ విద్యుత్ సంస్థలు ఉద్యోగాల్లోకి తీసుకో కుండా, జీతాలు కూడా చెల్లించట్లేదని వారు సుప్రీంకోర్టుకు నివేదించారు. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అశోక్‌భూషణ్, జస్టిస్ ఎమ్ఆర్ షా తెలంగాణ విద్యుత్ సంస్థల సీఎమ్‌డీలకు కోర్టు ధిక్కార నోటీసులు జారీ చేస్తూ, కేసును జులై 16వ తేదీకి వాయిదా వేశారు.