Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- థ్యాంక్యు మోడీ జీ అని ఎందుకనాలి: సామాన్యజనం
- దేశప్రజలకు ఉచితంగా టీకా వేస్తాన్ననందుకు ధన్యవాదాలు: బీజేపీ ప్రచారం
- ఎక్కడ చూసినా ఇవే హోర్డింగులు
ఇపుడు దేశంలో ఎక్కడ చూసినా 'థ్యాంకూ మోడీజీ' హౌర్డింగులే కనిపిస్తున్నాయి. కానీ ఆయన దేశప్రజలకు ఏం చేశారని సామాన్యజనం ప్రశ్నిస్తున్నారు. ప్రపంచంలో అందరికన్నా ముందు వ్యాక్సిన్ తయారు చేశాం. ఇక విశ్వగురు మేమే అని ప్రకటించుకున్న మోడీ... ఇప్పుడు వ్యాక్సిన్‌ను ఎన్నికల ప్రచారస్త్రంగా వాడుకునేందుకు వెనకడుగు వేయటంలేదు. అంతకుముందు కొవ్వొత్తులు వెలిగించమన్నారు. పూలు చల్లమన్నారు.. మొబైల్ ఫ్లాష్‌లైట్ ఆన్చేయాలన్నారు. ఇప్పుడు వ్యాక్సిన్ వేయించుకోమంటున్నారు.. కానీ, వ్యాక్సిన్ అందుబాటులో మాత్రం లేదు. ఇక గ్రామాల సంగతి చెప్పనే అక్కరలేదు.. అక్కడ వ్యాక్సిన్ పడింది చాలా తక్కువమందికే అని నివేదికలు ఇప్పటికే స్పష్టంచేస్తున్నాయి.
న్యూఢిల్లీ : అవసరాన్నిబట్టి... ఎన్నికలు ఉన్న ప్రాంతాలను ఆధారంగా రాజకీయం చేయాలనుకోవటం బీజేపీకి అలవాటుగా మారింది. నెలల వ్యవధిలో యూపీ ఎన్నికలు రాబోతుండటంతో.. ప్రచారాలకు వ్యాక్సిన్‌ను వినియోగించుకోవాలనుకుంటున్నది. అందులో భాగంగానే ధన్యవాదాలు మోడీ అంటూ హౌర్డింగులను ఏర్పాటు చేస్తున్నది.ఈ ఏడేండ్ల పాలనలో ఏం ఒరగబెట్టారంటూ జనం నిలదీస్తున్నారు.
వ్యాక్సిన్...కాశ్మీర్ రాజకీయం...!
వ్యాక్సిన్‌తో పాటు కాశ్మీర్ అంశాన్ని తెరపైకి తెచ్చింది మోడీ ప్రభుత్వం. కాశ్మీర్‌ను బహిరంగ జైలుగా మార్చారు. అక్కడి నాయకులను పిలిచి మాట్లాడటానికి ఆయనకు రెండేండ్లు పట్టింది. ఢిల్లీకి, (దిల్) హృదయానికి మధ్య దూరాన్ని తొలగిస్తామని హామీ ఇస్తున్నారు. అయితే దీనివెనుక రాజకీయం ఉన్నదన్న వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి.
కరోనా నియంత్రించలేక చేతులెత్తేసినందుకు బిగ్ థ్యాంక్యు..
కరోనాను నియంత్రించలేక చేతులెత్తేసినందుకు మోడీకి బిగ్ థ్యాంక్యు చెప్పాలి. కరోనా మహమ్మారికి దేశం ఏ విధంగా అల్లకల్లోలమైందో అందరికి తెలిసిందే. దేశప్రజల జీవితాలు చెల్లాచెదురైతే.. కోవిడ్ కాలంలో ఆస్పత్రుల్లో పడకలు లేక, వెంటిలేటర్ల కొరత ఎదురైంది. ఆక్సిజన్ అందక ఊపిరి ఆగిపోయిన అమాయకులు అనేకమంది. ఇపుడు ఢిల్లీ సర్కార్‌ను ఇరకాటంలో పెట్టేలా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తర్జనభర్జనపడుతున్నది. వాస్తవానికి ఆక్సిజన్ల కొరతగా ఢిల్లీలో మరణాలు అత్యధికమవుతుంటే.. కేంద్రం కిమ్మనాస్తిగా వ్యవహరించింది. కండ్ల ముందే తమవాళ్లకు ఆక్సిజన్ అందక ప్రాణాలు పోతుంటే.. నిస్సహాయస్థితిలో చూడకతప్పలేదు. ఆప్తుల్ని కోల్పోయిన బంధువులు రోడ్లపైకి వచ్చి రోదనలు అరణ్యరోదనలుగా మిగిలాయి. ఇలాంటి హృదయవిదారక దృశ్యాలను విదేశీ మీడియా హైలెట్ చేస్తే.. గోడీ మీడియా మాత్రం దాచిపెట్టే ప్రయత్నాలు చేసింది. చివరికి ఆప్ సర్కార్ ఢిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టును ఆశ్రయించాక గానీ ఆక్సిజన్ల కొరత తీరలేదు. ఇపుడు కేజ్రీవాల్‌ను దెబ్బతీయాలని బీజేపీ పాలిట్రిక్స్ చేస్తున్నది. ఢిల్లీలో అవసరానికి మించి నాలుగురెట్లు ఆక్సిజన్‌ను ప్రతిపాదించినట్టు కమలంపార్టీ ఆరోపిస్తున్నది. పరిస్థితులకనుగుణంగా ఆక్సిజన్ డిమాండ్ ఉన్నదని ఎయిమ్స్ చీఫ్ స్పష్టంచేశారు. మరోవైపు ఆక్సిజన్ డిమాండ్‌పై వేసిన కమిటీలో ఐదుగురు సభ్యులున్నారు. అయితే వారిలో ఇద్దరు సంతకాలు చేయటానికి నిరాకరించారు. అందులో ఢిల్లీ వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి భల్లా, మ్యాక్స్ ఆస్పత్రి తరఫున కమిటీలో ఉన్న మరొకరు ఉండటం విశేషం. ఇక ఆత్మనిర్భర్ భారత్ పథకం కూడా కరోనా పీడితులకు దక్కకుండాపోయింది.
ఆప్తుల్ని కోల్పోయిన వారికి అండ ఏదీ.?.
దేశంలో ఎన్నడూ చూడని విధంగా కోవిడ్ మరణాలు సంభవించాయి. శ్మశానవాటికల ముందు కష్టానికి క్యూలు. దహనసంస్కారాలు చేయటానికి స్థలాలులేక కొందరు గంగానదిలో పడేశారు. మరికొందరు ఇసుక దిబ్బల్లోనో.. మరోచోటనో ఖననం చేశారు. దేశప్రజల పరిస్థితి చూస్తూ ఊరుకోవటం మినహా చేయగలిగిందేమీలేదు. ఆప్తులను కోల్పోయి బాధలో ఉంటే.. సహాయం కోసం చేస్తున్న ఆర్తనాదాలు ఎవరికీ వినిపించలేదు. అపుడు మోడీ సర్కారు కానీ బీజేపీ నేతలు కానీ కనుచూపుమేరలో కనిపించలేదు. పైగా యూపీ సీఎం యోగి చేసిన ప్రకటనలు వాస్తవాలను దాచే ప్రయత్నం చేశాయి. కష్టాలను దిగమింగుకుని దేశపౌరులకు అండగా నిలవనందుకు మోడీకి ధన్యవాదాలు చెప్పాలా..అంటూ మృతుల బంధువులు ప్రశ్నిస్తున్నారు.
బురేదిన్లో ఉన్నా..
చెడ్డరోజులు(బురేదిన్) ముగిశాయనుకుని సంతోషపడాలా..! పన్నుల భారాలు, నిత్యావసరాలు,పెట్రో బాదుడుతో జనం జేబుల్లో చిల్లర కూడా మిగలటం లేదు. మళ్లీ మంచి రోజులు (అచ్చేదిన్) వస్తాయన్న అభూతకల్పన.. పూటకో అబద్ధాన్ని బీజేపీ తెరపైకి తెస్తున్నది.
2024 టార్గెట్‌గా పెట్టుకున్న ఐదురాష్ట్రాల ఎన్నికలకు ఇప్పటి నుంచే వ్యాక్సిన్ పాలిట్రిక్స్ మొదలుపెట్టారు. బాగా ప్రచారం చేసుకుంటున్నారు. అన్ని పత్రికల్లో మొదటిపేజీల్లో యాడ్స్‌కు కోట్లు ఖర్చుపెట్టారు. వాస్తవంగా వ్యాక్సిన్లకు భారీస్థాయిలో కొరత ఉన్నది. సుప్రీం కోర్టు జోక్యం, రాష్ట్రాల నుంచి ఒత్తిడికి తలొగ్గిన మోడీ ఉచిత వ్యాక్సిన్ ఇస్తామని ప్రకటించారు. అంతేకాదు ఒక్కొరకంగా వ్యాక్సిన్ ధరలు నిర్ణయించుకునే అధికారం కార్పొరేట్లకు కల్పించింది. ప్రయివేట్‌కు టీకా ద్వారాలు తెరిపించారు. ఇక యూపీలో మతరాజకీయాలతో పాటు వ్యాక్సిన్‌ను మాస్టర్ స్ట్రోక్‌గా ప్రయోగించినందుకూ మోడీకి ధ్యాంక్యూ అనాలా..అంటూ దేశప్రజలు అడుగుతున్నారు.
చివరగా...
దేశానికి ఎమర్జెన్సీ-2 అమలుచేస్తున్నందుకు మోడీని ఎలా ప్రసంశిం చాలి. ఎప్పుడో 70వ దశ కంలో అత్యవసరపరిస్థితి విధించినట్టు చదువు కుంటే.. ఇపుడు మోడీ హయాంలో అమలవు తున్న ఎమర్జన్సీ దేశ ప్రజల్ని భయపెడుతున్నది. మరోవైపు డెల్టాప్లస్ వేరియంట్ ప్రజలను భయపెడుతున్నది. ఇది మునుపటి వేవ్‌ల కన్నా ప్రమాదకరమని చెబుతున్నా.. బీజేపీ ప్రభుత్వం మేల్కొనక..డెల్టాప్లస్ గురించి భయాందోళనలు సృష్టించవద్దంటూ..చేతులుదులుపుకునే ప్రయత్నాలు చేస్తున్నది. జనం ప్రాణాలు ఊహించని విధంగా పోతున్నా... మరో మూడేండ్లు మా బతుకులు మారవంటూ..ఇంకా ఎంతగా హింసిస్తారోనన్న ఆందోళన పౌరుల్లో వ్యక్తమవుతున్నది.