Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జనం బతుకులు ఆగం
- ముడి చమురు 101 డాలర్లున్నప్పుడు లీటర్ పెట్రోల్ రూ.63
- గత ఏడాదికాలంగా 71 డాలర్లు.. పెట్రోల్ ధర రూ.110
- అంతర్జాతీయంగా తగ్గినా.. మనకు వాయింపే
- ప్రజలపై పన్నుల మోత..కార్పొరేట్లకు పన్ను మినహాయింపులు
- రూ.2.67 లక్షల కోట్ల నుంచి రూ.3.61లక్షల కోట్లకు పెరిగిన పన్ను ఆదాయం
దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు రూ.100 దాటుతుందని ఎవరూ ఊహించలేదు. కరోనాను మించి ఇంధన ధరలు, నిత్యావసర సరుకుల ధరలు సామాన్యుడ్ని బెంబేలెత్తిస్తున్నాయి. ఉద్యోగాలు పోయి, ఉపాధి లేక.. సామాన్యుడి బతుకు ఆగమైంది. అయినా మోడీ సర్కార్ పన్నుల మోత మోగిస్తోంది. ఇదేందని అడిగితే..అంతర్జాతీయ ముడి చమురు ధరలు, డాలర్ రేటు పెరిగిందని కారణం చెబుతోంది. ఇందులో ఏమాత్రమూ నిజం లేదని చమురు బాండ్లు, పన్ను రాబడులపై రాజ్యసభలో కేంద్రం విడుదల చేసిన సమాచారాన్ని చదివితే ఎవరికైనా అర్థమవుతుంది.
న్యూఢిల్లీ : ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు ధరల పెరుగుదల ఎందుకు ఆగిందో అందరికీ తెలుసు. జనాల ఓట్లు కావాలి కాబట్టి..ధరల పెంపును కేంద్రం ఆపింది. ధరల్ని పెంచాలనుకుంటే పెంచుతుంది..తగ్గించాలను కుంటే తగ్గిస్తుందని ఇక్కడ తేలిపోయింది. అంతర్జాతీయ మార్కెట్, డాలర్ మారకం..ఇదంతా ఒక సాకు మాత్రమేనని ఇప్పుడు అందరికీ అర్థమైంది. ధరల విధాన నిర్ణయం అంతా ప్రభుత్వ రంగ చమురు సంస్థలే చేస్తుంటే, ముడి చమురు ధర తగ్గినవేళ..ఆమేరకు ఇక్కడ ఇంధన ధరలు తగ్గాలి కదా? అలా ఎందుకు తగ్గటం లేదు? కారణం ధరల నిర్ణయమంతా కేంద్రమే చేస్తోంది కాబట్టి.
లాభం ఎవరికి?
యూపీఏ హయాంలో 15రోజులకొకమారు ఇంధన ధరల్ని సవరించేవారు. ఆ తర్వాత మోడీ సర్కార్ వచ్చాక...ఇంధన ధరలు ప్రతి రోజూ మారిపోతున్నాయి. అంతర్జాతీయంగా తగ్గితే...ఇక్క డా తగ్గుతుంది, డాలర్ పడిపోతే..ఇక్కడా తగ్గుతుంది, ధరల నిర్ణయ విధానంలో పారదర్శత తీసుకొచ్చాం..వినియోగదారుడికి ఇది చాలా లాభం..అని మొదట్లో పాలకులు తెగ ఊరించారు. చివరికి జనం నెత్తిమీద టోపీ పెట్టారు. లీటర్ పెట్రోల్ ధర రూ.65-70 మధ్క ఉండాల్సింది...రూ.110కు తీసుకొచ్చారు. అంతర్జాతీయ ముడి చమురు ధరలు, డాలర్ మారకం..ప్రకారం మనదేశంలో ఇంధన ధరలు ఎన్నడూ లేవు. జూన్ 2013లో అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ముడి చమురు ధర 101 డాలర్లు. అప్పుడు మనదేశంలో లీటర్ పెట్రోల్ ధర రూ.63. అక్టోబరు 2018లో బ్యారెల్ ముడి చమురు ధర సుమారుగా 80 డాలర్లు ఉండగా.. అప్పుడు లీటర్ డీజిల్ ధర రూ.76. గత ఏడాది కాలంగా ముడి చమురు ధర సగటున 71-73 డాలర్ల మధ్య చలిస్తోంది. ఆ లెక్కన చూసుకున్నా..మనదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రూ.65కు అటూఇటూగా ఉండాలి! అలాంటిది..లీటర్ పెట్రోల్ ధర రూ.110కు చేరుకుంది. అనేక రాష్ట్రాల్లో రూ.100దాటింది. ఇందులో 60శాతం కేంద్ర, రాష్ట్రాల పన్నులే ఉన్నాయి. ముఖ్యంగా ఎక్సైజ్ డ్యూటీ భారీగా పెరిగింది.
చమురు బాండ్లు..
యూపీఏ హయాంలో పెండింగ్‌లో ఉన్న చమురు బాండ్లు, వాటి వడ్డీ సుమారుగా మొత్తం రూ.2లక్షల కోట్లు భారమంతా ఎన్డీయే సర్కార్‌పై పడిందని, వీటి చెల్లింపు కోసమే ఇంధన ధరలు పెంపు కొనసాగుతోందని సామాజిక మాధ్యమంలో బీజేపీ నాయకులు తెగ ప్రచారం చేసుకుంటున్నారు. అయితే ఇది నిజమని, వాస్తవమని చెప్పే అధికార పత్రాలేవీ కేంద్రం వద్ద లేవు. ఒకవేళ ఉంటేగనుక బయటపెట్టాలని ప్రతిపక్షాలు అనేక సందర్భాల్లో డిమాండ్ చేశాయి. కాంగ్రెస్ ఎంపీ అహ్మద్ పటేల్ డిసెంబరు, 2018లో రాజ్యసభలో ఈ అంశంపై ప్రశ్నించాడు. 0దీనికి కేంద్రం నుంచి వచ్చిన సమాధానం..''కేంద్రంలో మోడీ సర్కార్ అధికారం చేపట్టేనాటికి (2014) మొత్తం చమురు బాండ్ల విలువ రూ.1.34లక్షల కోట్లు. ఇందులో రెండు సెట్ల బాండ్లు 2015లో మెచ్యూర్ అయ్యాయి. వీటి విలువ రూ.3500కోట్లు. ఇది మోడీ సర్కార్ చెల్లించింది.
2018-29నాటికి చమురు బాండ్ల విలువ రూ.1.30లక్షల కోట్లు. వీటికి సంబంధించి యూపీఏ-2 హయాంలో రూ.53,163కోట్లు వడ్డీ కింద చెల్లింపులు జరిగాయి. ఆ తర్వాత ఎన్డీయే-1 హయాంలో రూ.50,216కోట్లు చెల్లింపులు చేశారు''. బాండ్ల చెల్లింపులు, వాటిపై వడ్డీకి సంబంధించి ఎన్డీయే అదనంగా చెల్లింపులు చేయలేదని కేంద్రం విడుదల చేసిన గణాంకాలే చెబుతున్నాయి. మరి అలాంటప్పుడు బీజేపీ నాయకులు చెబుతున్న రూ.2లక్షల కోట్లు చమురు బాండ్ల భారం..అనేది పూర్తి అబద్ధమని తేలిపోయింది.
ప్రజలపై పన్నుల భారం
పెట్రోల్, డీజిల్ ధరల్లో 60శాతం కేంద్ర, రాష్ట్ర పన్నులే ఉన్నాయన్నది అందరికీ తెలిసిన విషయమే. ఇందులోనూ ఇంధనంపై కేంద్రం రకరకాల పన్నులు విధిస్తోంది. ఉదాహరణకు ఎక్సైజ్ డ్యూటీ భారీగా పెంచింది. దీంట్లో రాష్ట్రాలకు వాటా ఇవ్వకుండా కేంద్రమే అంతా లాగేసుకుంటోంది. 2020-21లో ఎక్సైజ్ పన్ను రాబడుల్లో భారీగా పెరుగుదల నమోదైంది. రూ.2,67,00 కోట్ల నుంచి రూ.3,61,00కోట్లకు పన్ను రాబడి పెరిగింది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పడిపోయినా..కూడా ధరల్ని తగ్గించకుండా..ఆ లాభాన్ని కేంద్రమే మింగేస్తోంది. మరోవైపు అత్యంత ధనికులకు, కార్పొరేట్లకు పన్ను ప్రయోజనాలు కల్పిస్తోంది. 2019లో మోడీ సర్కార్ రూ.1.45 లక్షల కోట్ల పన్ను మినహాయింపులు ఇచ్చింది. ఇంకోవైపు..సామాన్యులపై ఇంధన ధరల భారాన్ని మోపి..లక్షల కోట్ల రూపాయల్ని కేంద్రం వసూలు చేస్తోంది.