Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : కరోనా రెండోవేవ్ దేశవ్యాప్తంగా ఎంతోమంది వైద్యుల్ని సైతం బలితీసుకుంది. జూన్ 25నాటికి దేశంలో కరోనాబారినపడి 798మంది వైద్యులు మరణించారని, అత్యధికంగా ఢిల్లీలో 128మంది, బీహార్‌లో 115మంది, ఉత్తరప్రదేశ్‌లో 79మంది వైద్యులు చనిపోయారని 'ఇండియన్ మెడికల్ అసోసియేషన్' (ఐఎంఏ) మీడియాకు విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. పలు రాష్ట్రాల్లో కరోనా డెల్టా ప్లస్ వేరియెంట్ కేసుల సంఖ్య గణనీయంగా వెలుగులోకి వస్తున్నాయని, వైద్యుల్లో మరణాల సంఖ్య రెట్టింపు అవ్వడానికి కారణం డెల్టా ప్లస్ కారణమని ఐఎంఏ ఆందోళన వ్యక్తం చేసింది. మహారాష్ట్రలో డెల్టా ప్లస్ వేరియెంట్‌తో 23మంది వైద్యులు మరణించారని తెలిపింది. వైద్యుల మరణాల సంఖ్య అత్యల్పంగా పుదుచ్చెరిలో నమోదయ్యాయి. ఇక్కడ కేవలం ఒక వైద్యుడు కరోనాతో మరణించారు. గత ఆదివారం మన్ కీ బాత్‌లో ప్రధాని మోడీ కరోనా సంక్షోభంలో వైద్యుల పాత్రను గుర్తుచేసుకున్నారు. వారి సేవలు మరువలేనివని ప్రశంసించారు. వారిని గౌరవించాలని, పని ప్రదేశాల్లో వారికి తగిన భద్రతా చర్యలు కల్పిస్తామని చెప్పారు. నేడు జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా వారి సేవల్ని దేశ ప్రజలు స్మరించుకుంటున్నారు. ఈ సందర్భంగా ఐఎంఏ అధ్యక్షుడు మాట్లాడుతూ..'' పని ప్రదేశాల్లో వైద్యులకు రక్షణ, భద్రతా చర్యలు చేపడుతున్నట్టు ప్రధాని తెలిపారు. వారిని గౌరవించాలని జాతినుద్దేశించి చెప్పారు. వ్యాక్సిన్ ప్రాధాన్యతను తెలిపారు. నేడు దేశవ్యాప్తంగా వైద్యుల దినోత్సవాన్ని మేం జరుపుకుంటున్నా''మని అన్నారు. దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌తో మరణించిన వైద్యుల వివరాల్ని ఐఎంఏ విడుదల చేసింది. రాష్ట్రాల వారీగా గణాంకాలు ఈ విధంగా ఉన్నాయి. ఢిల్లీలో అత్యధికంగా 128మంది, బీహార్‌లో 115, యూపీలో 79, పశ్చిమ బెంగాల్లో 62, రాజస్థాన్‌లో 44, జార్ఖాండ్‌లో 39, ఆంధ్రప్రదేశ్‌లో 40 మంది వైద్యులు మరణించారు. మంగళవారం నాడు దేశవ్యాప్తంగా 37,566 కరోనా కేసులు నమోదయ్యాయి. గత 102 రోజుల్లో 40వేలకు దిగువకు కేసులు వెళ్లటం ఇదే మొదటిసారి. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,03,16,897కు చేరుకున్నాయి. ఇందులో యాక్టీవ్ కేసుల సంఖ్య 5,52,659గా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలు విడుదల చేసింది.