Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యాక్సిన్ కొనుగోలు ఒప్పందాన్ని రద్దుచేసిన బ్రెజిల్
న్యూఢిల్లీ : కోవాగ్జిన్ ఒప్పందాన్ని బ్రెజిల్ ప్రభుత్వం రద్దు చేసుకుంది. 2కోట్ల కోవాగ్జిన్ డోసుల సరఫరాకు బ్రెజిల్తో భారత్ బయోటెక్ ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఈ ఒప్పందం విలువ (324 మిలియన్ డాలర్లు) రూ.2,234కోట్లు కాగా, వ్యాక్సిన్ సరఫరాలో ముడుపులు ముట్టాయని, అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆ దేశ చట్టసభ సెనెటర్లు ఆరోపించారు. వీటిపై విచారణ జరిపిన ఫెడరల్ దర్యాప్తు సంస్థలు ఆరోపణలు నిజమేనని తేల్చాయి. అధిక ధరకు టీకాల కొనుగోలు చేసేందుకు ఒప్పుకున్నారని, వ్యాక్సిన్ కంపెనీలతో చర్చలు కూడా త్వరితగతిన ముగించారని, నియంత్రణా సంఘాల నుంచి అనుమతులు లేకుండానే అధ్యక్షుడు బోల్సోనారో ఒప్పందంపై సంతకాలు చేశారని ఆరోపణలు వచ్చాయి. దాదాపు రూ.734కోట్లమేర ముడుపులు మధ్యవర్తి కంపెనీతోపాటు..బ్రెజిల్ అధ్యక్షుడు బోల్సోనారోకి ముట్టినట్టు సెనెటర్లు ఆరోపించారు. ఇది చాలా పెద్ద కుంభకోణమని సెనెటర్లు అనుమానిస్తున్నారు. ఒప్పందం కుదర్చటంలో బ్రెజిల్ అధ్యక్షుడు జెయిర్ బోల్సోనారో ప్రత్యేక ఆసక్తిని కనబర్చారని, ఆయన సన్నిహితులకు లబ్ది చేకూరేలా లావాదేవీలు జరిగాయని సెనెటర్లు అంటున్నారు.