Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నివాసితుల తరలింపు, ఇండ్ల కూల్చివేత
- ఖోరీ గ్రామస్థుల ఆందోళన హింసాత్మకం
- అడ్డుకున్న పోలీసులు.. లాఠీచార్జీ
న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఢిల్లీ, హర్యానా సరిహద్దులోని ఫరీదాబాద్‌లో గల ఖోరీ గ్రామంలో అలజడిని సృష్టించాయి. న్యాయస్థానం తీర్పునకు వ్యతిరేకంగా వారి ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. పోలీసులు వారిని అడ్డుకోవడానికి లాఠీలకు సైతం పనిచెప్పారు. అరవల్లి పర్వత శ్రేణి గ్రీన్ కవర్‌ను రక్షించడంలో భాగంగా అక్కడ ఉన్న కాలనీని తొలగించాలనీ, ఇండ్లను కూల్చివేయాలని సుప్రీంకోర్టు ఉత్తర్వుల సారాంశం. ఈ నెల 7న ఈ తీర్పును వెలువర్చిన సుప్రీంకోర్టు.. దీనికి సంబంధించిన సమ్మతి నివేదికలను హర్యానా ప్రభుత్వ అధికారుల నుంచి కోరింది. అయితే, దీనిపై అక్కడి స్థానికుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకున్నది. పునరావాసంపై హామీ ఇవ్వకుండా తాము ఉంటున్న ప్రదేశాన్ని ఖాళీ చేయించే న్యాయస్థానం ఉత్తర్వులకు వ్యతిరేకంగా వారు ఆందోళనకు నిర్ణయించుకున్నారు. ఖోరీ గ్రామానికి చెందిన దాదాపు 500 మంది నిరసనకారులను పోలీసులు బుధవారం అడ్డుకున్నారు.
సుప్రీంకోర్టు తీర్పు తర్వాత గ్రామంలో పోలీసు అధికారులు 144 సెక్షన్‌ను విధించారు. అయితే, అక్కడి ప్రజలు మాత్రం తమ నిరసన ద్వారా ప్రభుత్వానికి ఒక సందేశాన్ని పంపాలని యోచించారు. పునరావాసం కోసం ఎలాంటి ఏర్పాట్లు లేకుండా కరోనా మహమ్మారి సమయంలో ఇలాంటి చర్యలకు దిగడంపై తమ నిరసనను తెలియజేయాలని వారు భావించారు. ఇందులో భాగంగా వారు తమ ప్రాంతంలోని అంబేద్కర్ పార్కులో ప్రవేశించడానికి యత్నించారు. అయితే, ఆ సమయంలో వారు పోలీసుల నుంచి తీవ్ర ప్రతిఘటనను ఎదుర్కొన్నారు. నిరసనకారులను చెదరగొట్టడానికి పోలీసులు లాఠీచార్జీ జరిపారు. సుప్రీంకోర్టు, ప్రభుత్వ ఆదేశాలానుసారం నిరసనలకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. ఖోరీ గ్రామ నివాసి సుశీల్ కుమార్ మాట్లాడుతూ.. '' మాలాంటి అమాయక ప్రజలతో వారు ఇలాగే చేస్తారు. మేము మా గొంతు వినిపించడానికి మాకు వేరొక ప్రదేశం లేదు. ఈ రోజుల పోలీసులు లాఠీలతో మాకు సమాధానం చెప్పారు. మా విషయంలో కోవిడ్ మార్గదర్శకాలు, కోర్టు, ప్రభుత్వ ఆదేశాలు వర్తిస్తే.. దాదాపు 400 మంది మోహరించిన పోలీసుల విషయంలో ఇది వర్తించదా?'' అని ప్రశ్నించారు.
ఇదిలా ఉండగా, నిరసనకారులపై పోలీసులు అత్యంద దారుణంగా ప్రవర్తించారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. నిరసనకారులను బలవంతంగా బయటకు లాగడం, వారిపై బలవంతం చేయడం వంటివి ఇందులో కనిపించాయని వారు చెప్పారు. బీసీఈఎం గ్రూపునకు చెందిన ఇద్దరు విద్యార్థి నాయకులు రవీందర్ కౌర్, రాజ్వీర్ సింగ్ లను కూడా సూరజ్‌కుండ్ పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. కాగా, బీజేపీ తమలను మోసం చేసిందనీ, తమను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకొన్నదని నిరసకారులలో ఒకరు ఆందోళన వ్యక్తం చేశారు. తమను ఆక్రమణదారులని ముద్రవేయడం దారుణమని చెప్పారు.