Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కృష్ణా జలాల అక్రమ వినియోగంపై క్యాబినెట్లో ఏపీ సీఎం
- తెలంగాణ కేటాయింపుల్లో కోతకు కేంద్రానికి వినతి
- ప్రధాని, జలశక్తి మంత్రికి ఫిర్యాదు
అమరావతి : 'ఎగువున ఉన్న తెలంగాణా ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చి మరీ కృష్ణాజలాలను అక్రమంగా వాడుకుంటోంది. దిగువన ఉన్న వారిని చేతగానివాళ్లలా లెక్కగడుతోంది. ఇకపై చూస్తూ ఊరుకోం. వారి ఆటలు సాగనివ్వం.' అని రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నట్లు సమాచారం. బుధవారం వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణా ప్రభుత్వం కృష్ణా రిజర్వాయర్లలో చేస్తున్న విద్యుత్ ఉత్పత్తి, జిఓ విడుదల, తెలంగాణా మంత్రుల వ్యాఖ్యలు తదితర అంశాలు చర్చకు వచ్చినట్లు తెలిసింది. తెలంగాణ ప్రభుత్వ వైఖరిపై ప్రధానమంత్రికి, కేంద్ర జలశక్తి మంత్రికి లేఖ ద్వారా ఫిర్యాదు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. అదే విధంగా ప్రాజెక్టుల నుండి తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా వినియోగించుకున్న నీటిని ఆ రాష్ట్రానికి చేసిన కేటాయింపుల నుండి కోత పెట్టాలని కృష్ణా బోర్డు అథారిటీని కోరాలని కూడా నిర్ణయించారు. ఈ సందర్భంగా పలువురు మంత్రులు కూడా తెలంగాణా మంత్రుల వ్యాఖ్యల పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. అనంతరం సిఎం మాట్లాడుతూ పులిచింతలకు దిగువభాగంలో నదీ జలాలను నిలువ చేసుకునే అవకాశం లేదని తెలిసినప్పటికీ ఇష్టం వచ్చినట్టుగా విద్యుత్ ఉత్సాదన చేస్తున్నారని అన్నారు. కృష్ణానదిలోకి సుమారు ఏడు టిఎంసిల నీరు వస్తే అందులో సగం వాడేశారని ఇంతకంటే దుర్మార్గం మరొకటి లేదని అన్నారు. శ్రీశైలం, నాగార్జునసాగర్, చివరకు నీరు అడుగంటిన పులిచింతలలోనూ విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారని పేర్కొన్నారు. ఇరిగేషన్ డిమాండును బట్టి విద్యుత్ ఉత్పత్తి ఉండాలని, ఈ నిబంధనను తెలంగాణా ఉల్లంఘించి ఇష్టం వచ్చినట్లు చేసుకుపోతోందన్నారు. తెలంగాణాలో పాలమూరు రంగారెడ్డి, దిండి అక్రమ ప్రాజెక్టులని, నెట్టెంపాడు ఎత్తు పెంచుతున్నారని, వాటికి అనుమ తులు లేవని వివరించారు. వీటిపై అవసరమైతే ఎంతదూరమైతే వెళతామన్నారు. హుజురాబాద్‌లో ఎన్నికల్లో సెంటిమెంటును రెచ్చగొట్టి లబ్దిపొందాలనే ఉద్దేశం కనిపిస్తోందని, దీనికోసం కావాలనే వ్యాఖ్యా నాలు చేస్తున్నారని సిఎం అన్నట్లు సమాచారం.
వారంలో రెండు రోజులు జిల్లాల్లో ఉండండి
ఇన్‌ఛార్జి మంత్రులకు వారికి కేటాయించిన జిల్లాలపై పట్టు ఉండటం లేదని, దీంతో ఫిర్యాదులు పెరుగుతున్నాయని మంత్రివర్గ సమావేశంలో సిఎం అన్నట్లు తెలిసింది. ఇక నుండి వారంలో రెండు రోజుల పాటు తమకు కేటాయించిన జిల్లాల్లో ఇన్‌ఛార్జి మంత్రులు ఖచ్చితంగా ఉండాలని ఆయన సూచించనట్లు సమాచారం. పార్టీ కార్యక్రమాలు, నాయకత్వం పనితీరు తదితర అంశాలపైనా ఇన్‌ఛార్జి మంత్రులు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించి నట్లు తెలిసింది. ప్రభుత్వంలో ఉన్నాం కదా అనే పేరుతో పార్టీని వదిలేస్తే నష్టం వాటిల్లుతుందని, పార్టీ కార్యక్రమాలపైనా దృష్టి సారించాలని సూచించారు.
గట్టిగా బదులిస్తాం : మంత్రి అనిల్
కృష్ణాజలాల వినియోగంలో తెలంగాణా ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై గట్టిగానే బదులిస్తామని జలవనరుల శాఖా మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్ అన్నారు. క్యాబినెట్ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఘర్షణ పూరిత వాతావరణం వద్దనే ఉద్దేశంతో శాంతియుతంగా వ్యవహరిస్తున్నామని అన్నారు. అక్రమంగా ప్రాజెక్టులు కడుతూ పోతిరెడ్డిపాడును చూపించి ఇష్టం వచ్చినట్లు చేసుకుపోతున్నారని అన్నారు. కరోనా ఉందనే ఉద్దేశంతోనే కెఆర్ఎంబి తనిఖీ కమిటీకి తాము అధికారులను ప్రతిపాదించలేదన్నారు.