Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీకాకు నోచుకోని 99 శాతం మంది
- ధనిక దేశాల ఆధిపత్యం
-- మహమ్మారి అంతం కావాలంటే కనీసం 70 శాతం మందికి వ్యాక్సిన్ అందాలి : ఆరోగ్య నిపుణులు
న్యూఢిల్లీ : ఇన్ఫెక్షన్, ఇంజెక్షన్‌కు మధ్య పోటీలో ఇంజెక్షన్ ఓడిపోయింది. ప్రపంచవ్యాప్తంగా పేద దేశాలు కరోనా వ్యాక్సిన్ కష్టాలను ఎదుర్కొంటున్నాయి. ఇప్పటికీ ఈ దేశాల్లోని 99 శాతం మంది ప్రజలకు టీకా అందకపోవడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తున్నది. అయితే, ఈ పరిస్థితులపై ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 790 కోట్ల మంది జనాభాకు గానూ.. కనీసం 70 శాతం మంది ప్రజలకు పూర్తిగా ( రెండు డోసులు) వ్యాక్సిన్‌ను తప్పక అందిస్తేనే కోవిడ్-19 మహమ్మారికి అంతం పలికే అవకాశం ఉంటుందని అంచనా వేశారు. కాగా, జూన్ 21 నాటి వరకు ఉన్న సమాచారం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 10.04శాతం జనాభా పూర్తిగా వ్యాక్సిన్‌కు నోచుకున్నది. అయితే, ఈ జనాభా కూడా దాదాపు ధనిక దేశాల నుంచే కావడం గమనార్హం. కానీ, తక్కువ ఆదాయం కలిగిన దేశాలలో 0.9శాతం మంది మాత్రమే కనీసం ఒక్క డోసు వ్యాక్సిన్‌ను పొందారు.
ధనిక దేశాల వద్ద అధిక డోసుల వ్యాక్సిన్
కాగా, కరోనా వ్యాక్సిన్‌ను పొందే విషయంలో ధనిక దేశాలు ఆధిపత్యం ప్రదర్శిస్తున్నాయి. దీనితో పేద దేశాలు వెనకబడిపోతున్నాయని నిపుణులు తెలిపారు. అనేక ధనిక దేశాలు ఒక వ్యూహం ప్రకారం కరోనా వ్యాక్సిన్ డోసులను అధిక మొత్తంలో కొనుగోలు చేశాయన్నారు. ఉదాహరణకు.. యూఎస్ఏ 120 కోట్ల వ్యాక్సిన్ డోసులను కొనుగోలు చేసింది. అంటే, ఆది ఆదేశంలో ఒక్కో వ్యక్తికి 3.7 డోసులతో సమానం. ఇక కెనడా 38.1 కోట్ల డోసులకు ఆర్డర్ చేసింది. ఇంత మొత్తం వ్యాక్సిన్లతో ఒక్కో కెనడా పౌరుడికి ఐదు సార్లు వ్యాక్సిన్ ఇవ్వచ్చు. దీని ప్రకారం.. ప్రపంచ జనాభాల్లో ఏడో వంతు జనాభా కలిగి ఉన్న దేశాలు.. జూన్ నాటికి సగం కంటే ఎక్కువ వ్యాక్సిన్లను రిజర్వ్ చేసుకోవడం గమనార్హం.
పేద దేశాలకు సరిపడా అందని డోసులు
ఇక కొన్ని పేద దేశాలను చూసుకుంటే.. బెనిన్.. చైనాకు చెందిన సినోవాక్ వ్యాక్సిన్‌కు చెందిన 203,000 డోసులను పొందింది. కానీ, ఈ డోసులతో ఆ దేశ జనాభాలో కేవలం 1శాతం మందికి మాత్రమే పూర్తిగా వ్యాక్సిన్‌ను అందించే అవకాశం ఉంటుంది. ఇక ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌పై ఆధారపడిన హౌండురస్.. దాదాపు 14 లక్షల డోసులను సమకూర్చుకోగలిగింది. దీనితో అక్కడి జనాభాలో ఏడు శాతం మందికి మాత్రమే పూర్తిగా వ్యాక్సిన్‌ను అందించడం కుదురుతుంది. వ్యాక్సిన్ డోసుల కొరత ఫలితంగా ఇలాంటి దేశాల్లో ఫ్రంట్ లైన్ ఆరోగ్య కార్యకర్తలు కూడా పూర్తిగా వ్యాక్సినేషన్‌కు నోచుకోకపోవడం గమనార్హం. హైతి దేశం దాదాపు 4, 61,500 కోవిడ్-19 వ్యాక్సిన్ డోసులను డొనేషన్ల ద్వారా అందుకున్నది.
ధనిక దేశాల్లోనూ అసమానతలు
ఇక ఈ ధనిక దేశాల్లోనూ ప్రజలకు వ్యాక్సిన్లు అందించే విషయంలోనూ అసమనాతలు నెలకొన్ని ఉన్నాయి. ముఖ్యంగా రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, విదేశాలకు వెళ్లేవారు.. ఇలా ఉన్నతశ్రేణి వర్గాలు పూర్తిగా వ్యాక్సినేషన్‌ను పొందడం గమనార్హం. అయితే, ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో పేద దేశాల్లోని ప్రజారోగ్య వ్యవస్థలు, వ్యాక్సిన్ల కొనుగోలుకు మరింత ఫండ్ అవసరమని నిపుణులు తెలిపారు. జీ-7 వంటి ధనిక దేశాలు.. ఈ కార్యక్రమాన్ని చేయగలిగే సత్తా ఉన్నప్పటికీ అవి కేవలం మాటలకే పరిమితమవుతున్నాయనీ, చేతలు మాత్రం శూన్యమని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వైపు ధనిక దేశాలు ఆలోచిస్తే కరోనాకు ముగింపు పలకగలమనీ, లేకపోతే మహమ్మారి అలాగే విజృంభించి కొత్త వేరియంట్లు ఉద్భవించి మరిన్ని ప్రమాదాలకు దారి తీసే అవకాశం ఉన్నదని తెలిపారు.