Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఘాజీపూర్ వద్ద రైతులపై బీజేపీ కార్యకర్తల దౌర్జన్యం
- ఆందోళన వేదికపైకి రాళ్లు.. ప్రతిఘటించిన కర్షకులు
- ఐదుగురికి గాయాలు.. పోలీసుల ప్రేక్షక పాత్ర : ఎస్కేఎం ఖండన
- బీజేపీ నేతల తోలు తీస్తాం : రాకేశ్ తికాయత్
న్యూఢిల్లీ : అన్నదాతలపై బీజేపీ కార్యకర్తలు మరోసారి దౌర్జన్యానికి దిగారు. శాంతియుతంగా ఆందోళనచేస్తున్న రైతులపై దాడికి యత్నించారు. కాగా, బీజేపీ కార్యకర్తల దాడిని అన్నదాతలు తిప్పికొట్టారు. ఢిల్లీ-ఉత్తరప్రదేశ్ సరి హద్దు ఖాజీపూర్ వద్ద ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్‌వేపై జరుగు తున్న రైతుల ఆందోళనపై బీజేపీ కార్యకర్తలు బుధవారం దూసుకెళ్లారు. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో రైతుల ఆందోళన స్థలంలో తమ పార్టీ జెండాలు పట్టుకొని బీజేపీ కార్యకర్తలు గుమిగూడటాన్ని చూసిన రైతులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో వారు రైతులతో వాగ్వివాదానికి దిగారు. రైతుల ఆందోళన కేంద్రాన్ని హింసాత్మకంగా మార్చేం దుకు ప్రయత్నించారు. అన్నదాతలపై రాళ్ళు రువ్వారు.
ఘజీపూర్ సరిహద్దు వద్ద బీజేపీ నాయకుడు అమిత్ వాల్మీకి స్వాగతం పలికే నెపంతో పలువురు బీజేపీ, ఆర్ఎస్ ఎస్ కార్యకర్తలు, మద్దతుదారులు ఘర్షణ వాతావరణాన్ని సృష్టించారు. రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. రైతుల ఉద్య మానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిరసన వ్యక్తం చేస్తు న్న రైతులను 'జాతి వ్యతిరేకులు, ఖలిస్తానీలు, ఉగ్రవాదులు' అంటూ నినాదాలు చేశారు. రైతుల వేదికపైకి రాళ్ళు రువ్వారు. అంతేకాదు, దూకుడుగా రైతుల వేదిక వైపు వెళుతూ.. అక్కడున్న డివైడర్ దాటేందుకు ప్రయత్నించారు. దీనిపై రైతులు అభ్యంతరం వ్యక్తం చేసి, నల్ల జెండాలతో ప్రతిఘటించారు. అక్కడి నుంచి వెళ్లిపోవాలని రైతులు పట్టుబట్టారు. ఇంతగొడవ జరుగుతున్నా.. పోలీసులు మాత్రం ప్రేక్షక పాత్ర పోషించారు. ఈ ఘర్షణలో దాదాపు ఐదుగురు రైతులు గాయప డ్డారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఆందోళన చేస్తున్న రైతులు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు జరుగుతోందని పోలీసులు తెలిపారు. కాగా, ఇది రైతులపై బురద చల్లేందుకు బీజేపీ సర్కార్ చేసిన మరో 'కుట్ర' అని రైతు నాయకులు విమర్శించారు. 'రైతులతో అసభ్యంగా ప్రవర్తించారు. పలు వాహనాలను ధ్వంసం చేశారు' అని సంయుక్త కిసాన్ మోర్చా నేత జగ్తార్ సింగ్ బజ్వా విమర్శించారు. 'ప్రభుత్వ ఈ కుట్ర విజయవంతం కాదు. ఎందుకంటే రైతుల నిరసనను అంతం చేయడానికి ఇటువంటి వ్యూహాలు గతంలో కూడా చేశారు' అని ఆయన అన్నారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదుచేశామని చెప్పారు. ఎటువంటి చర్యలూ తీసుకోకపోతే.. తాము తమ భవిష్యత్ వ్యూహాన్ని రూపొందించుకుంటామని బజ్వా చెప్పారు.
బీజేపీ నేతల తోలు తీస్తాం : రాకేశ్ తికాయత్ హెచ్చరిక
ఘాజీపూర్ సరిహద్దుల్లో రైతుల ఆందోళనపై బీజేపీ కార్యకర్తలు దాడిచేయటాన్ని రైతు ఉద్యమ నేత రాకేశ్ తికాయత్ తీవ్రంగా ఖండించారు. బీజేపీ నేతల తోలు తీస్తామంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 'రైతు ఆందోళన వేదికను బీజేపీ నేతలుకబ్జా చేయాలని చూస్తే.. చూస్తూ ఊరుకోం..' అన్నారు. తమ ఆందోళన వద్దకొచ్చి, బీజేపీ నేతలను స్వాగతించడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారనీ, ఇది ఎలా కుదురుతుందని ప్రశ్నించారు.
ఎస్కేఎం ఖండన
ఆందోళన చేస్తున్న రైతులపై బీజేపీ కార్యకర్తల దాడిని ఎస్కేఎం నేతలు ఖండించారు. ఈ మేరకు ఎస్కేఎం నేతలు బల్బీర్ సింగ్ రాజేవాల్, డాక్టర్ దర్శన్పాల్, గుర్నమ్సింగ్ చారుని, హన్నన్ మొల్లా, జగ్జిత్ సింగ్ దల్లెవాల్, జోగిందర్ సింగ్ ఉగ్రహాన్, శివకుమార్ శర్మ 'కక్కాజీ', యుధ్వీర్ సింగ్, యోగేంద్ర యాదవ్ సంయుక్తంగా ప్రకటన విడుదల చేశారు. రైతులను ప్రేరేపించడానికి, రెచ్చగొట్టడానికి బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు చాలా రోజులుగా ప్రయత్నిస్తున్నారన్నారు. కుల, మత పరంగా ప్రజలను విభజించడంతో సహా, ఏదో ఒక విధంగా అసమ్మతి, అవాంతరాలను తీసుకురావడానికి బీజేపీ ప్రయత్నిస్తున్నదని విమర్శించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ల పనికిమాలిన వ్యూహాలు అందరికీ తెలుసనీ, రైతులు వీటిని తీవ్రంగా వ్యతిరేకిస్తారని అన్నారు. ఈ ప్రత్యేక స్థలంలో ''బీజేపీ నాయకుడిని స్వాగతించడానికి'' అనుమతించిన అధికారులను శిక్షించాలని ఎస్కేఎం డిమాండ్ చేస్తుందని అన్నారు.
మహారాష్ట్రలో ముఖ్యమంత్రిని కలిసిన రైతు నేతలు
మహారాష్ట్రలో సంయుక్త కిసాన్ మోర్చా, అఖిల భారత కిసాన్ సంఘర్ష్ సమన్వయ కమిటీకి చెందిన పలువురు రైతు నాయకులు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిశారు. జూలై 5న జరగబోయే రాష్ట్ర శాసనసభ సమావేశాల్లో మూడు నల్లచట్టాలను రద్దుచేయాలని తీర్మానం చేయాలని కోరారు. రైతు బృందం ఉప ముఖ్యమంత్రి, ఇతర మంత్రులతో కూడా సమావేశమైంది.
సింఘూ సరిహద్దుకు రైతులు
సింఘూ, టిక్రీ సరిహద్దులవద్దకు అధిక సంఖ్యలో రైతులు వచ్చి చేరుతున్నారు. హర్యానా రైతులు 200 క్వింటాళ్ల గోధుమలను విరాళంగా ఇచ్చారు. సింఘూ బోర్డర్‌కు తీసుకెళ్లారు. రైతుల ఉద్యమానికి ఉన్న స్థానిక మద్దతును మరోసారి ప్రదర్శిస్తున్నారు. హూల్ క్రాంతి దివాస్‌లో చేరడానికి రైతుల బందం హర్యానా నుంచి సింఘూ సరిహద్దుకు చేరుకుంది.
రైతుల ఉద్యమం కోసం ఉద్యోగం త్యాగం
రైతుల ఉద్యమం కోసం పంజాబ్ యువకుడు తన ఉద్యోగాన్ని త్యాగం చేశారు. రైతుల ఉద్యమంలో పాల్గొనేందుకు లుథియానాకు చెందిన గుర్ప్రీత్ సింగ్ సిధ్వాన్ కలాన్ యూఎస్ఏలో తన ఉద్యోగాన్ని వదులుకున్నాడు. అతను ఇంతకు ముందు సింగపూర్‌లో పనిచేసేవాడు. ఉద్యమం డిమాండ్లు నెరవేరేవరకూ పోరాటంలో భాగస్వామి కావాలని ఆయన నిర్ణయించుకున్నారు.