Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమ్మె విజయవంతం చేసినందుకు సీఐటీయూ, ఎస్డబ్ల్యూఎఫ్ఐ అభినందనలు
న్యూఢిల్లీ : కార్మికుల చట్టబద్ధమైన డిమాండ్ల పరిష్కారం, హక్కులకు సంబంధించి కేంద్ర కార్మికశాఖ అనుసరిస్తున్న అహంకారపూరిత వైఖరికి నిరసనగా చేపట్టిన సమ్మెలో పెద్దయెత్తున పాల్గొని విజయవంతం చేసినందుకు ప్రభుత్వరంగ ఉక్కు పరిశ్రమ కార్మికులకు సీఐటీయూ, స్టీల్ వర్కర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎస్డబ్ల్యూఎఫ్ఐ) అభినందనలు తెలిపాయి. కార్మికుల ఐక్య పోరాటానికి సెల్యూట్ చేసింది. ఈ ఐక్యతను మరింత బలోపేతం చేయాలని అన్ని యూనియన్లు, కార్మికులకు గురువారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చాయి. ఎస్ఏఐఎల్, ఆర్ఐఎన్ఎల్ కింద ఉండే ప్రభుత్వ రంగ ఉక్కు పరిశ్రమ కార్మిక యూనియన్ల పిలుపు మేరకు వేతన ఒప్పందం చేయాలనీ, ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ చేస్తూ గతనెల 28న విశాఖపట్నం సీట్ ప్లాంట్ కార్మికులు నిర్వహించిన సమ్మె విజయవంతమైన విషయం తెలిసిందే.
అదేవిధంగా ఎస్ఏఐఎల్ ప్లాంట్లు, గనుల కార్మికులు 30న సమ్మె చేపట్టారు. శాశ్వత, కాంట్రాక్టు ఉద్యోగులకు ఎటువంటి షరతులు లేకుండా వేతన సవరణ చేయాలని కార్మికులు డిమాండ్ చేశారు. 1.5 లక్షల మందికి పైగా కార్మికుల్లో 70 శాతానికి పైగా కార్మికులు ఈ సమ్మెలో పాల్గొని తమ నిరసన తెలియజేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా కార్మికుల వేతన సవరణ గత నాలుగున్నరేళ్లుగా పెండింగ్లోనే ఉంది. 52 నెలల తరువాత నేషనల్ జాయింట్ కమిటీ ఫర్ స్టీల్ (ఎన్జేసీఎస్) స్థాయిలో ద్వైపాక్షిక చర్చలు ప్రారంభమైనా, వేతనాల పెంపునకు బదులుగా వేతనాలతో పాటు ఇతర ప్రయోజనాలను కుదించే విధంగా ప్రతికూల షరతులతో దాని కార్యచరణ ఉంది. అయినప్పటికీ అన్ని యూనియన్లు సహనాన్ని ప్రదర్శిస్తూ చర్చలలో పాల్గొన్నాయి. అయితే గత ఆరు నెలలుగా ఇదే వైఖరిని కొనసాగుతున్న నేపథ్యంలో నిరసనగా సమ్మె చేపట్టాయి. -