Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : మూడు రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలనీ, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో జరుగుతున్న రైతుల ఉద్యమం ఉధృతంగా కొనసాగుతున్నది. ఆందోళనల్లో భాగస్వామ్యం అయ్యేందుకు భారీగా అన్నదాతల కదులుతున్నారు. కొనసాగుతున్న పోరాటాన్ని బలోపేతం చేయడానికి వివిధ రాష్ట్రాల నుంచి వేలాది మంది రైతులు సరిహద్దులకు చేరుకుంటున్నారు. గతకొన్ని రోజులుగా ప్రతిరోజూ భారీగా రైతులు సరిహద్దులకు చేరుకుంటున్నారు. రైతు ఉద్యమం గురువారం నాటికి 217వ రోజుకు చేరింది. సింఘూ, టిక్రీ, ఘాజీపూర్, షాజాహన్పూర్, పల్వాల్ సరిహద్దుల్లో వేలాది రైతులు ఆందోళనల్లో భాగస్వాములవుతున్నారు.
సింఘూ బోర్డర్లో పంజాబ్కుచెందిన 32 రైతు సంఘాల సమావేశం జరిగింది. పంజాబ్ ప్రభుత్వం పంట పొలాలకు కనీసం ఎనిమిది గంటల విద్యుత్ సరఫరా అందించాలని సమావేశం డిమాండ్ చేసింది. ఇందుకోసం జూలై 5 వరకు ప్రభుత్వానికి గడువునిచ్చింది. అప్పటిలోగా చేయకపోతే జూలై 6న పటియాలా వద్ద సీఎంను ఘెరావ్ చేస్తామని ప్రకటించాయి.
బీజేపీ కార్యకర్తలపై కేసు నమోదు చేయాలి: ఎస్కేఎం
ఘాజీపూర్ యూపీ గేట్ వద్ద బుధవారం జరిగిన సంఘటనకు ఉత్తరప్రదేశ్ పోలీసులు బాధ్యత వహించాలని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) నేతలు డిమాండ్ చేశారు. దాడులకు తెగబడిన కాషాయ మూకలపై కేసు నమోదుచేయాలని కోరాయి. ఈ మేరకు గురువారం ఎస్కేఎం నేతలు బల్బీర్ సింగ్ రాజేవాల్, డాక్టర్ దర్శన్ పాల్, గుర్నమ్ సింగ్ చారుని, హన్నన్ మొల్లా, జగ్జిత్ సింగ్ దల్లెవాల్, జోగిందర్ సింగ్ ఉగ్రహన్, శివకుమార్ శర్మ 'కక్కాజీ', యుధ్వీర్ సింగ్, యోగేంద్ర యాదవ్ సంయుక్తంగా ప్రకటన విడుదల చేశారు. బీజేపీ కార్యకర్తల ఫిర్యాదును పోలీసులు నమోదు చేయగా, రైతుల ఫిర్యాదు నమోదు కాలేదని అన్నారు. దీనికి నిరసనగా రైతుల ఫిర్యాదు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ ఉత్తరప్రదేశ్లోని పలు పోలీస్ స్టేషన్ల వద్ద ఎస్కేఎం నిరసన కార్యక్రమాలు నిర్వహించిందని అన్నారు.