Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి బలి తీసుకుంటున్న వారి సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉంది. అయితే, గతేడాది మార్చి నుంచి పంజా విసురుతున్న మహమ్మారి కారణంగా ఇప్పటివరకు ఢిల్లీలో 2 వేల మందికి పైగా పిల్లలు తల్లి లేదా తండ్రిని కోల్పోయారని తాజాగా ఢిల్లీ కమిషన్ ఫర్ ప్రొటక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (డీసీపీసీఆర్) వెల్లడించింది. డీసీపీసీఆర్ సర్వే వివరాల ప్రకారం.. కరోనా కారణంగా తల్లిదండ్రుల్లో ఒకరు లేదా ఇద్దరిని కోల్పోయిన చిన్నారుల సంఖ్య 2,029గా గుర్తించారు. వీరిలో 67 మంది చిన్నారులు తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయి.. దిక్కులేనివారయ్యారు. 651 మంది పిల్లలు తమ తల్లులను కోల్పోగా, 1,311 మంది పిల్లలు తండ్రులను కోల్పోయారు. కరోనాతో తల్లిందడ్రులు మరణించిన పిల్లలకు అవసరమైన విధంగా ప్రయోజనాలు అందించేందుకు, ప్రభుత్వ పథకాల లబ్దిచేకూరేందుకు మహిళా, శిశు అభివృద్ధి శాఖ ప్రయత్నాలు చేస్తున్నది.ఈ క్రమంలోనే డీసీపీసీఆర్ ఒక హెల్ప్‌లైన్ నెంబర్ (9311551398)ను అందుబాటులోకి తీసుకువచ్చింది. తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల వివరాలను దీని ద్వారా తెలియచేయవచ్చు. పిల్లల హక్కుల గురించి కూడా తెలుసుకోవచ్చు. ఢిల్లీ ప్రభుత్వ ఆరోగ్యశాఖ అందించిన డేటాను ఉపయోగించి కరోనా కారణంగా తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలను గుర్తించడానికీ, పిల్లల శ్రేయస్సు కోసం వివిధ సర్వేలు చేపట్టటానికి కమిషన్ ఈ హెల్ప్‌లైన్‌ను ఉపయోగిస్తుందని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 4500లకు పైగా ఫిర్యాదులు అందినట్టు వెల్లడించారు. వీటిలో 2,200లు అత్యవసర కేటగిరిలోకి చెందినవి ఉన్నాయి. ఇలాంటి ఫిర్యాదులు 85శాతం 24 గంటల్లో పరిష్కారించబడగా, మిగిలిన 15 శాతం 72 గంటల్లో పరిష్కరించడ్డాయి. డీసీపీసీఆర్ చైర్ పర్సన్ అనురాగ్ కుందు మాట్లాడుతూ.. డీసీపీసీఆర్ హెల్స్‌లైన్ నెంబర్ గత మూడు నెలల్లో పిల్లలలకు సహాయం చేయడానికి మరింతగా వారికి చేరువైందన్నారు. ఈ ఏడాది పూర్తయ్చే నాటికి ఇలాంటి ఫిర్యాదులు 20 వేల అందే అవకాశముందన్నారు.