Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో డిమాండ్
న్యూఢిల్లీ: సినిమాటోగ్రఫీ చట్టానికి ప్రతిపాదిత తిరోగమన సవరణలను తక్షణం వెనక్కు తీసుకోవాలని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ చట్టంలో మోడీ ప్రభుత్వం తీసుకున్న రావాలనుకుంటున్న సవరణలు సినీనిర్మాతల సృజనాత్మక ప్రతిభ, రాజ్యాంగ హక్కుగా ఉన్న భావ ప్రకటనా స్వేచ్ఛపై దాడి చేసే విధంగా ఉన్నాయని గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది. చట్టంలోని సెక్షన్ 5 బీ (1) (సినిమాలను సర్టిఫై చేయడంలో మార్గదర్శకత్వం కోసం సూత్రాలు) ఉల్లంఘించిన పేరుతో రివిజనరీ(పున:పరిశీలన) అధికారాన్ని పొందేందుకు ఒక నిబంధనను జోడించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నది. ఇది ఇప్పటికే సర్టిఫై అయిన సినిమాలను వెనక్కు పిలిపించడంతో సమానమని పేర్కొంది. ఇటీవల కాలంలో హిందూత్వ శక్తుత నేతృత్వంలోని మితవాద, కులవాద గ్రూపులు తమ విధానాలకు వ్యతిరేకంగా ఉండే, నచ్చని సినిమాలపై మూక సెన్సార్‌షిప్‌లో పాల్గొంటున్నాయని పొలిట్‌బ్యూరో పేర్కొంది. ఇప్పుడు తమ సిద్ధాంతానికి వ్యతిరేకంగా, విమర్శనాత్మకంగా ఉండే సినిమాలను అడ్డుకునే అధికారాన్ని ప్రభుత్వమో పొందాలనుకుంటోందని విమర్శించింది. పిల్మ్ సెన్సార్ బోర్డు స్వయంప్రతిపత్తి అధికారాలను కేంద్ర ప్రభుత్వం ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్‌కాస్టింగ్ మంత్రిత్వ శాఖ ద్వారా వివిధ మార్గాల్లో అణచివేయాలని కుట్రలు పన్నుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేసింది. అదేవిధంగా తమ సినిమాలకు సెన్సార్‌బోర్డు పెట్టే కోతలకు వ్యతిరేకంగా సినీనిర్మాతలు అప్పీల్ చేసుకునే అప్పీలేట్ ట్రిన్యునల్ను కూడా మంత్రిత్వశాఖ ఈ ఏడాది ఏప్రిల్‌లో ఏకపక్షంగా రద్దు చేసిందని పేర్కొంది. ఈ విధమైన సినిమా ప్రతిభను, స్వేచ్ఛను దెబ్బతీసే విధంగా రూపొందించిన ఈ దారుణమైన సవరణలను వ్యతిరేకిస్తున్నామని, సినీ నిర్మాతలు డిమాండ్ చేస్తున్న విధంగా అప్పీలేట్ ట్రిబ్యునల్‌ను వెంటనే పునరుద్ధరించాలని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో తన ప్రకటనలో డిమాండ్ చేసింది. ప్రజాస్వామ్యం, భావ ప్రకటనా స్వేచ్ఛపై కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఈ దాడికి వ్యతిరేకంగా ధైర్యంగా తమ గొంతు వినిపించిన సినిమా ఇండిస్టీలోని వారికి మద్దతు ప్రకటించింది.