Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఏఏ వ్యతిరేక ఉద్యమకారుడు విడుదల
- ఉపా కింద అరెస్టయిన మరో ముగ్గురికి విముక్తి
గువహతి : సీఏఏ వ్యతిరేక ఉద్యమకారుడు, రైజోర్ దళ్ అధ్యక్షుడు అఖిల్ గొగోరుపై నమోదైన రెండో కేసులోని అభియోగాలను కూడా జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) ప్రత్యేక కోర్టు గురువారం కొట్టేస్తూ నిర్దోషిగా ప్రకటించింది. దీంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. మొదటి కేసులోని అభియోగాలను కోర్టు గతనెల 25న కొట్టేసిన విషయం తెలిసిందే. 2019లో కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఆమోదింపజేసుకున్న వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో అఖిల్ గొగోరు పాల్గొన్నారు. అసోంలో జరిగిన సీఏఏ వ్యతిరేక ఆందోళనల సందర్భంగా గొగోరు హింసను రెచ్చగొట్టారని, ఆయనకు మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో పోలీసులు ఐపీసీ, చట్టవిరుద్ధ కార్యకాలాపాల చట్టం(యుఎపిఎ)లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 2019, డిసెంబర్ నుంచి గొగోరు జైల్లో ఉన్నారు. ధిబ్రుగర్లోని చబువా పోలీస్స్టేషన్, గువహతిలోని చాంద్మరి పోలీస్స్టేషన్లలో నమోదైన ఎఫ్ఐఆర్ల ఆధారంగా అఖిల్ గొగోరుపై ఈ కేసులు పెట్టారు. గొగోరుతో పాటు అరెస్టైన మరో ముగ్గురు కూడా జైలు నుంచి విడుదలైనట్టు గొగోరు తరపు న్యాయవాది శాంతను బోర్తాకుర్ తెలిపారు. విడుదల అనంతరం గొగోరు మీడియాతో మాట్లాడుతూ తనపై ప్రభుత్వం మోపిన అభియోగాలు వట్టి బోగస్ అని కోర్టు తేల్చిందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం యూఏపీఏ, ఎన్ఐఎలను దుర్వినియోగం చేస్తోందని, తప్పుడు కేసుల కారణంగా సంవత్సరన్నరకు పైగా జైల్లో ఉండాల్సి వచ్చిందని అన్నారు. భవిష్యత్తు కేసులపై కోర్టు తాజా తీర్పు ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అఖిల్ గొగోరు జైల్లో ఉండే సిబ్సాగర్ ఎమ్మెల్యేగా ఎన్నికైన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటాన్ని కొనసాగించడంతో పాటు నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి పెడతాననని అఖిల్గొగోరు పేర్కొన్నారు.