Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నూతన డెల్టా ఫ్లస్ వేరియంట్ భయాలు
- ఐహెచ్ఎస్ మర్కిట్ రిపోర్ట్
న్యూఢిల్లీ : కరోనా, లాక్డౌన్ నిబంధనలతో ప్రస్తుత ఏడాది జూన్ మాసంలో పారిశ్రామిక ఉత్పత్తి కార్యకలాపాలు 11 మాసాల కనిష్టానికి పడిపోయాయని ఓ ప్రయివేటు సర్వేలో తేలింది. వైరస్ దెబ్బకు డిమాండ్ తగ్గిందని.. దీంతో చాలా ఉద్యోగాలు ఊడిపోయాయని ఐహెచ్ఎస్ మర్కిట్ తెలిపింది. అనేక రాష్ట్రాలు లాక్డౌన్ నిబంధనలను సడలించినప్పటికీ.. కొత్త డెల్టా ప్లస్ వేరియంట్ ఆర్థిక వ్యవస్థను ఆందోళనకు గురి చేస్తుందని విశ్లేషించింది. ఈ నేపథ్యంలోనే గడిచిన జూన్‌లో పారిశ్రామిక కార్యకలాపాలు 48.1కి తగ్గాయని ఐహెచ్ఎస్ మర్కిట్ రూపొందించిన ది నిక్కీ మానుఫాక్చరింగ్ ఫర్చేజింగ్ మేనేజర్స్ సూచీ (ఐఎన్పిఎంఐ-ఈసీఐ)లో పేర్కొంది. ఇంతక్రితం మేలో ఇది 50.8 గా ఉంది. 50కి దిగువన ఉంటే ప్రతికూల వృద్థిని చవి చూస్తున్నట్లు. కరోనా సంక్షోభం భారత పారిశ్రామిక రంగంపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఐహెచ్ఎస్ మర్కిట్ ఎకనామిక్స్ అసోసియేట్ డైరెక్టర్ పాల్లిన్న డీ లీమా పేర్కొన్నారు. ముఖ్యంగా మూలధన ఉత్పత్తుల (క్యాపిటల్ గూడ్స్) విభాగం అత్యంత పేలవంగా ఉందన్నారు. డిమాండ్ లేమితో గత 11 మాసాల్లో ఎప్పుడూ లేని స్థాయిలో తయారీ కార్యకలాపాలు పడిపోయాయని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత జిడిపి 9.5 శాతానికే పరిమితం కావొచ్చని ఇటీవల ఆర్బిఐ తన రిపోర్ట్‌లో పేర్కొంది. ఇంతక్రితం ఈ అంచనా 10.5 శాతంగా ఉన్నది. ఆర్థిక వ్యవస్థ రికవరీపై దృష్టి కేంద్రీకరిస్తున్నట్టు తెలిపింది.