Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర ప్రభుత్వ నిరంకుశత్వం
- రక్షణ రంగంలోని ఉద్యోగుల ఆందోళనలు,
- సమ్మెలపై నిషేధం విధిస్తూ ఆర్డినెన్స్
- ఐక్య పోరాటాన్ని అడ్డుకునేందుకే.. : సీఐటీయూ
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ నిరంకుశ విధానాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. దేశ సంపదను కార్పొరేట్ల జేబుల్లో నింపేందుకు తాము చేసే పనులకు అడ్డంకులు ఉండకూడదన్న అప్రజాస్వామిక వైఖరితో ముందుకెళ్లోంది. తాజాగా రక్షణ రంగ సేవల్లో ఉన్న ఉద్యోగులు, కార్మికులు ఆందోళనలు చేయడం గానీ, సమ్మెలో పాల్గొనడం గానీ చేయకూడదని ఆదేశిస్తూ మోడీ సర్కార్ బుధవారం ఒక అర్డినెన్స్ జారీ చేసింది. రక్షణ రంగంలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు(ఓఎఫ్‌బీ)ని ఏడు ముక్కలు చేసి కార్పొరేట్ సంస్థలకు అప్పగించే కేంద్ర క్యాబినెట్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యోగ సంఘాలు ఈనెల 26 నుంచి నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ అత్యవసర రక్షణ సేవల అర్డినెన్స్(ఈడీఎస్‌ఓ)-2021ను జారీ చేయడం గమనార్హం. ఈ ఆర్డినెన్స్‌పై కార్మిక సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రక్షణ రంగ ఉద్యోగుల ఐక్య పోరాటాన్ని అణచివేసే చర్యల్లో భాగంగానే కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసిందని సీఐటీయూ గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది. దేశ ప్రయోజనాలను కాపాడడంలో భాగంగా ఆందోళనబాట పట్టిన రక్షణ రంగ ఉద్యోగుల పట్ల కేంద్రం వ్యవహరిస్తున్న వైఖరిని ఖండించింది. రక్షణ పరికరాల ఉత్పత్తి, సేవలు, సైన్యంతో అనుసంధానించబడిన ఏదైనా పరిశ్రమ కార్యకలాపాల్లో పాల్గొనే ఉద్యోగులతో పాటు రక్షణ ఉత్పత్తుల మరమ్మతు, నిర్వహణలో పనిచేసే ఉద్యోగులు ఈ ఆర్డినెన్స్ పరిధిలోకి వస్తారని కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ తెలిపింది. ఆర్డినెన్స్ ప్రకారం చట్టవిరుద్ధ సమ్మెను ప్రారంభించడం లేదా కొనసాగుతున్న సమ్మెలో పాల్గొనడం నిషేధం అని, ఒకవేళ పాల్గొంటే సంవత్సరం పాటు జైలుశిక్ష లేదా రూ.10 వేల వరకు జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉందని పేర్కొంది. సమ్మెలో పాల్గొనాలని ఇతరులను ప్రేరేపిస్తే, జరిమానాతోటు రెండేండ్ల వరకు జైలుశిక్ష పడుతుందని ఆర్డినెన్స్ పేర్కొంది. 200 ఏండ్లకు పైగా చరిత్ర ఉన్న ఓఎఫ్‌బీని ముక్కలు చేసి ప్రభుత్వ యాజమాన్యంలోని ఏడు కార్పొరేట్ సంస్థలుగా విభజించాలని కేంద్ర ప్రభుత్వం గతనెల 16న జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నది. రక్షణ రంగ ఉత్పాదకను పెంచేందుకు, జవాబుదారీతనం, సామర్థ్యం, పోటీతత్వం, వృత్తిపరమైన నైపుణ్యం పెంచడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. అయితే ప్రభుత్వం చెప్పేది వట్టి బూటకమనీ, వ్యూహాత్మకంగా కీలకమైన రక్షణ రంగాన్ని ప్రయివేట్ పరం చేసేందుకే అది ఈ పనిచేస్తోందని కార్మిక సంఘాలు విమర్శిస్తున్నాయి. ఓఎఫ్‌బీ ఏడు కార్పొరేట్ సంస్థలుగా విడగొట్టి, లాభదాయకమైన వాటిని ప్రయివేట్‌కు అప్పగించేందుకు ముందస్తు ప్రణాళికలో భాగంగానే కేంద్రం ఈ చర్య తీసుకుందని పేర్కొంటున్నాయి.
ఆర్డినెన్స్‌ను ఖండించిన సీఐటీయూ
రక్షణ రంగ ఉద్యోగుల ఐక్య పోరాటాన్ని అణచివేసే లక్ష్యంతో తీసుకుకొచ్చిన ఆర్డినెన్స్‌ను ఖండిస్తున్నట్టు సీఐటీయూ ఒక ప్రకటనలో పేర్కొంది. ఓఓఫ్బి కింద ఉన్న 44 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల ప్రయివేటీకరణకు మార్గం సుగమం చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం విధ్వంసకర నిర్ణయం తీసుకుందని విమర్శించింది.