Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సేవింగ్స్.. రుణాలే దిక్కు
- కోవిడ్-19 కాలంలో వీటి పైనే ఆధారపడ్డ భారతీయులు
- ప్రభుత్వం నుంచి మద్దతు కరువు : నిపుణులు
దేశంలో కరోనా తీసుకొచ్చిన దుర్భర పరిస్థితులు ప్రజలను ఆర్థికంగా దెబ్బతీశాయి. భవిష్యత్తు కోసం తాము దాచిపెట్టుకున్న పొదుపు సొమ్మును, బ్యాంకుల నుంచి రుణాలను 'వర్తమానం' కోసం ఉపయోగించుకోవాల్సిన పరిస్థితి ప్రజలకు ఏర్పడింది. అయితే, కష్టకాలంలో ప్రజలను ఆదుకొని అండగా నిలవాల్సిన ప్రభుత్వం నుంచే సరైన స్పందన కరువవడంతో ప్రజలకు ఈ బాధలు తప్పలేదు. ఈ పరిస్థితులపై దేశంలోని ఆర్థిక నిపుణులు, విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేశారు.
న్యూఢిల్లీ : గతేడాది కాలం నుంచి దేశాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి కారణంగా దాదాపు 30 కోట్ల మంది ప్రజలు ప్రభావితమయ్యారు. దాదాపు నాలు లక్షల మంది ప్రాణాలు కోల్పోయిన విషయం విదితమే. ఒక దశలో మహమ్మారి తీవ్ర విజృంభణ కారణంగా లాక్డౌన్ పరిస్థితులు ఏర్పడి దాదాపు 12 కోట్ల మంది వరకు తమ ఉద్యోగాలను కోల్పోయారు. దీంతో ఆ కుటుంబాలు ఆర్థికంగా తీవ్ర ఇక్కట్లను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. చివరికి కాన్పులకూ ఎంతో ఇబ్బందుల బారినపడినట్టు పలువురు మహిళలు తెలిపారు. అయితే, ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వ మద్దతు లేనప్పుడు ప్రజలు తమ కొద్దిపాటి పొదుపులను ఉపయోగించడం తప్ప, మనుగడ కోసం రుణాలు తీసుకోవడం తప్ప వేరే మార్గం లేదని ఆర్థిక నిపుణులు తెలిపారు. అయితే, ఈ విషయాలు గృహ పొదుపులు, రుణాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఇటీవల విడుదల చేసిన నివేదికలో ప్రతిబింబిస్తుందని వారు వెల్లడించారు. గృహ రుణాల త్రైమాసిక సమాచారం ప్రకారం.. 2020 మార్చితో ముగిసిన త్రైమాసికం నుంచి అదే ఏడాది డిసెంబర్ మధ్య గృహ రుణాలు 68.9 లక్షల కోట్ల రూపాయల నుంచి రూ. 73.1 లక్షల కోట్లకు పెరిగింది. అంటే తొమ్మిది నెలల్లోనే ఇది రూ. 4.25 లక్షల కోట్ల పెరుగుదలను చూడటం గమనార్హం. అలాగే, గతేడాది మార్చి త్రైమాసికం ముగింపునాటికి జీడీపీలో గృహ రుణ వాటా 33.8 శాతంగా ఉన్నది. అదే ఏడాది అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో ఇది దేశ జీడీపీలో 37.9 శాతానికి పెరగటం గమనించాల్సిన అంశం. దేశ జీడీపీ నేల చూపు చూస్తున్న సమయంలో గృహ రుణాల భారీ పెరుగుదల దాని అపారమైన స్థాయిని, ప్రభావాన్ని సూచిస్తుందని నిపుణులు తెలిపారు. ఇదిలా ఉండగా, గతేడాది బ్యాంకుల్లో పొదుపులు కూడా తగ్గాయి. 2020 జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో బ్యాంక్ డిపాజిట్లు రూ. 3.6 లక్షల కోట్ల నుంచి సగానికి తగ్గాయని గణాంకాలు తెలిపాయి. అయితే, అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికం నాటికి రూ. 1.7 లక్షల కోట్లకు బ్యాంకు డిపాజిట్లు తగ్గడం గమనార్హం. గతేడాది జులై-సెప్టెంబర్లో జీడీపీలో బ్యాంక్ డిపాజిట్ల వాటా 7.7 శాతంగా ఉన్నది. అది అక్టోబర్-డిసెంబర్ మధ్య కేవలం మూడు శాతానికి పడిపోవడం గమనించాల్సిన అంశం. అయితే, గతేడాది కరోనా మహమ్మారి కాలంలో ప్రజలు తాము బతకండం కోసం సేవింగ్స్, రుణాలను ఏ విధంగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందో ప్రస్తుత గణాంకాలను చూస్తే అర్థమవుతుందని నిపుణులు చెప్పారు. ఇంత జరిగినప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం గత అనుభవాల నుంచి పాఠాలు నేర్చినట్టు కనబడటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.