Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రధానికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాల లేఖ
న్యూఢిల్లీ : ఆర్థికమాంద్యం, కరోనా విపత్తు నేపథ్యంలో గత ఏడాది జనవరి నుంచి కరువు భత్యం ప్రకటించటాన్ని మోడీ సర్కార్ ఆపేసింది. అయితే ఈ విషయమై కేంద్రం పునరాలోచన చేసి, డీఏ, డీఆర్‌లను తిరిగి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు ప్రధాని మోడీకి లేఖ రాశాయి. కేంద్ర సచివాలయ ఉద్యోగులు, టీచర్లు, కార్పొరేషన్ కార్మికులు, ఇతర ప్రభుత్వ శాఖల ఉద్యోగ సంఘాలు ఐదు ప్రధాన డిమాండ్లను కేంద్రం ముందు ఉంచాయి. ఆహార ధాన్యాలు, పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువుల ధరలు అనూహ్యంగా పెరిగాయని, ఈ నేపథ్యంలో పెరిగిన ద్రవ్యోల్బణం ప్రకారం కరువు భత్యం ప్రకటించాలని ఉద్యోగ సంఘాలు కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాయి. గత 18 నెలలుగా డీఏ బకాయిలు పేరుకుపోయాయని, ఉద్యోగులు, పెన్షనర్లకు రావాల్సిన అన్ని బకాయిల్నీ కేంద్రం చెల్లించాలని ఉద్యోగ సంఘాలు ప్రధానిని కోరాయి. పెరిగిన ద్రవ్యోల్బణం ప్రకారం డీఏ, డీఆర్‌లను ప్రతి ఆరు నెలలకు ఒకమారు కేంద్రం ప్రకటిస్తుంది. కేంద్రం నిర్ణయించిన తర్వాత ఆయా రాష్ట్రాలు కూడా డీఏ, డీఆర్‌లను ప్రకటిస్తాయి. ఇది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు వర్తిస్తుంది. అయితే కరోనా విపత్తు, ఆర్థికమాంద్యం ఉగ్రరూపం దాల్చడంతో గత ఏడాది ఏప్రిల్‌లో కేంద్రం కీలక ప్రకటన చేసింది. గత ఏడాది జనవరి నుంచి డీఏ, డీఆర్‌ల చెల్లింపు ఆపేస్తున్నట్టు మోడీ సర్కార్ ప్రకటించింది. దీనివల్ల గత 18 నెలలుగా కోటీ 15లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు అందాల్సిన ప్రయోజనాలు ఆగిపోయాయి. దీనివల్ల కేంద్ర ప్రభుత్వానికి రూ.1.2లక్షల కోట్లు నిధులు సమకూరాయని, ఇప్పటికైనా డీఏని పునరుద్ధరించాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి.
ఒకే దేశం..ఒకే వేతనం
ప్రభుత్వ ఉద్యోగులు, కార్మికుల వేతన చెల్లింపుల్లో అనేక అసమానతలున్నాయని, దీనిని పరిష్కరించాలని ప్రధానికి రాసిన లేఖలో ఉద్యోగ సంఘాలు పేర్కొన్నాయి. 'ఒకే దేశం..ఒకే వేతనం' అనే విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని కోరాయి. అలాగే కరోనా వైరస్‌తో చనిపోయిన ఫ్రంట్‌లైన్ వర్కర్లకు రూ.50లక్షల బీమా చెల్లించాలని, బాధిత కుటుంబాల బ్యాంకు ఖాతాలకు ఆ మొత్తాన్ని నగదు బదిలీ చేయాలని లేఖలో తెలిపారు. చనిపోయిన ఉద్యోగి కుటుంబంలోని వ్యక్తికి ప్రభుత్వ ఉద్యోగం, వారి కుటుంబానికి పెన్షన్ వెంటనే అందజేయాలని ఉద్యోగ సంఘాలు కోరాయి.