Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సిమ్లా: ఉత్తర భారతంలో ఓవైపు ఎండలు దంచి కొడుతుంటే.. మరోవైపు కొన్ని ప్రాంతాలను ఆకస్మిక వరదలు ముంచెత్తుతున్నాయి. హిమాచల్‌ప్రదేశ్‌లో ఆకస్మిక వరదల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. చంబా వ్యాలీలో ఆకస్మికంగా వరద రావడంతో స్థానిక జనం ఉలిక్కిపడ్డారు. ముఖ్యంగా జులాఖడీ, ముగ్లా, కరియన్, హర్దాస్పురాల్లో పరిస్థితి దారుణంగా మారింది. చంబా జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రోడ్లపై వరదనీరు నిండటంతో వాహనదారులు నరకయాతన అనుభవిస్తున్నారు. వాహనాలు బురదలో ఇరుక్కుపోయాయి. మరోవైపు వర్షం కూడా ప్రారంభమై ఎడతెరిపి లేకుండా కురుస్తుండటంతో వరద ఆగడం లేదు. అధికారులు భారీ సహాయక చర్యలు చేపట్టి, రోడ్లపై వరదనీటిని తొలగించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ అధికారుల తీరుపై స్థానికులు మండిపడుతున్నారు. ప్రతి ఏటా చంబా లోయలో ఇదే సమస్య ఉందని, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. మరోవైపు వరద ఇంకా తగ్గుముఖం పట్టకపోవడంతో కొన్ని ప్రాంతాల్లో వాహనాలు నీటిపై తేలాడుతున్నాయి. వరద తగ్గిన చోట వాహనలు బురదలో కూరుకుపోయాయి. దీంతో వాహన యాజమానులు లబోదిబోమంటున్నారు.