Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లైంగికదాడి బాధితుల విషయంలో సుప్రీం స్పష్టీకరణ
న్యూఢిల్లీ: లైంగికదాడి కేసులపై విచారణ సందర్భంగా ఏ ప్రోసీడింగ్స్లోనూ బాధితురాలి పేరును ప్రస్తావించొద్దని సుప్రీంకోర్టు మరోసారి స్పష్టం చేసింది. ఇటువంటి కేసులను డీల్ చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలని సబార్డినేట్ కోర్టులకు సూచించింది. బాధితురాలి పేరును ప్రస్తావిస్తూ ఇటీవల ఛత్తీస్‌గడ్‌లోని ఒక సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పుపై అభ్యంతరం వ్యక్తం చేయడంతో పాటు మినహాయింపు ఇస్తూ సర్వోన్నత న్యాయస్థానం తాజాగా ఒక పిటిషన్‌పై తీర్పు సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. లైంగికదాడి కేసుల్లో బాధితురాలి పేరును ప్రస్తావించకపోవడం మంచిదనీ, ఈ విషయంలో భవిష్యత్తు కేసుల్లో జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని జస్టిస్ అశోక్ భూషణ్, వినీత్ శరణ్, ఎంఆర్ షాలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. 2001లో జరిగిన ఒక ఒక లైంగికదాడి కేసులో దోషిగా తేలిన వ్యక్తికి మహాసముంద్‌లోని సెషన్స్ కోర్టు 10 ఏండ్ల జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ దోషి దాఖలు చేసిన పిటిషన్‌ను ఛత్తీస్గడ్ హైకోర్టు కొట్టేస్తూ 2019 డిసెంబర్లో తీర్పు వెలువరించగా, దాన్ని కూడా సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు. ఈ స్పెషల్ లీవ్ పిటిషన్‌ను అనుమతించేందుకు తాము మొగ్గు చూపడం లేదనీ, దీనిని తోసిపుచ్చుతున్నామని పేర్కొంటూ సర్వోన్నత న్యాయస్థానం గతనెల 30న ఆదేశాలు జారీచేసింది. కేసులోని వాస్తవాల ఆధారంగా ఈ పిటిషన్‌ను కొట్టేస్తున్నట్టు ఈ సందర్భంగా పేర్కొంది. లైంగిక వేదింపులు,దాడి కేసుల్లో బాధితురాల పేరు, ఇతర వివరాలను(వారు మరణించినప్పటికీ కూడా..) ఏ విధంగానూ వెల్లడించరాదని సుప్రీంకోర్టు 2018, డిసెంబర్లో ఇచ్చిన తీర్పులో పేర్కొంది.