Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 18 శాతం రుణాల వాటా ... మొత్తం అప్పుల్లో బడా వర్గం
- ఏడాదిలో ఎన్పీఏలు 11 శాతానికి చేరొచ్చు : ఆర్బీఐ ఎఫ్ఎస్ఆర్ రిపోర్ట్
ముంబయి : భారత బ్యాంక్‌లు ఇచ్చిన మొత్తం అప్పుల్లో కేవలం 100 మంది 18 శాతం వాటా కలిగి ఉన్నారని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గణంకాలు చెబుతున్నాయి. దీంతో ప్రభుత్వ, ఆర్బీఐ ఆర్థిక విధానాలు బడా సంస్థలు, కార్పొరేట్ వ్యక్తులకు ఎంత అనుకూలంగా ఉన్నాయే స్పష్టం అవుతోంది. మరోవైపు 2022 మార్చి ముగింపు నాటికి బ్యాంకుల స్థూల నిరర్థక ఆస్తులు 9.8 శాతానికి ఎగిసే అవకాశాలున్నాయని ఆర్బీఐ అంచనా వేసింది. 2021 మార్చి నాటికి ఈ రాని బాకీలు (ఎన్పీఏ)లు 7.5 శాతంగా ఉన్నాయని ఆర్బీఐ ద్వైవార్షిక ఆర్థిక స్థిరత్వ నివేదిక (ఎఫ్ఎస్ఆర్)లో గవర్నర్ శక్తికాంతదాస్ వెల్లడించారు. వచ్చే మార్చి ముగింపు నాటికి తాము వేసినవి కనీస అంచనాలేనని పేర్కొన్నారు. పరిస్థితులు మరీ ప్రతికూలంగా మారితే స్థూల ఎన్పీఏలు 11.22 శాతానికి కూడా పెరిగిపోవచ్చన్నారు. ఆర్బీఐ ఎఫ్ఎస్ఆర్ రిపోర్ట్ ప్రకారం.. ముఖ్యంగా ప్రభుత్వరంగ బ్యాంకుల స్థూల ఎన్పీఏలు 2021 మార్చి నాటికి 9.54 శాతంగా ఉన్నాయి. 2022 మార్చి నాటికి ఇవి 12.52 శాతానికి చేరొచ్చని అంచనా. అయితే బ్యాంకుల వద్ద తగినంత నిధులున్నాయని శక్తికాంత దాస్ పేర్కొన్నారు. ఆర్థిక సంస్థల బ్యాలన్స్ షీట్లపై ప్రభావం గతంలో వేసిన స్థాయిలో ఉండకపోవచ్చన్నారు. తాము ప్రకటించిన చర్యలు పూర్తి స్థాయిలో ఆచరణ రూపం దాలిస్తేనే వాస్తవ ప్రభావం ఎంతన్నది తెలుస్తుందన్నారు. ఆర్థిక స్థిరత్వమే తమ ప్రాధాన్యంగా పేర్కొన్నారు. కరోనా రెండో విడత భారత్‌పై తీవ్ర ప్రభావం చూపిందని శక్తికాంత దాస్ పేర్కొన్నారు. కాగా మే చివరి నుంచి ఆర్థిక కార్యకలాపాలు పుంజుకుంటున్నాయన్నారు. పెరుగుతున్న డేటా తస్కరణ, సైబర్ దాడుల సమస్యలను దేశ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటుందన్నారు.