Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 20 రోజుల్లో రూ.1.40 లక్షల కోట్ల నష్టం
- కుబేరుల జాబితాలో పడిపోయిన స్థానం
న్యూఢిల్లీ : అదానీ గ్రూపు కంపెనీల్లో విదేశీ హవాలా సంస్థల పెట్టుబడుల ఆరోపణలు బడా కార్పొరేట్ గౌతమ్ అదానీకి వరుస నష్టాలను తెచ్చిపెడుతున్నాయి. కేవలం 20 రోజుల్లోనే అదానీ సంపద 18.8 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.1.40 లక్షల కోట్లు) హరించుకుపోయింది. అదానీ గ్రూపులో ఒకే చిరునామాతో కనీసం వెబ్సైట్లేని మూడు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పిఐ) వేల కోట్లలో పెట్టారని జూన్ 14న వచ్చిన వార్తలు అదానీ కంపెనీల షేర్లను దిగజారేలా చేస్తున్నాయి. దీంతో దేశంలోనే రెండో అతిపెద్ద కుబేరుడిగా ఉన్న గౌతమ్ అదానీ ప్రపంచ బిలియనీరుల జాబితాలో కీలక స్థానం కోల్పోయారు.
మారిషాస్ కేంద్రంగా పని చేస్తున్న అల్బులా ఇన్వెస్ట్మెంట్ ఫండ్, క్రెస్టా ఫండ్, ఎపిఎంఎస్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ లాంటి మూడు అనుమానిత విదేశీ సంస్థలు అదానీ గ్రూపునకు చెందిన నాలుగు కంపెనీల్లో రూ.43,500 కోట్ల పెట్టుబడులు పెట్టాయి. మనీ లాండరింగ్ నివారణ చట్టం ప్రకారం.. అదానీ గ్రూపు ఈ ఖాతాల యాజమాన్యానికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించకపోవడంతో వాటిని ఎన్ఎస్డిఎల్ స్తంబింపజేసిందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అదానీ గ్రూపులో ఆరు లిస్టెడ్ కంపెనీలు ఉన్నాయి. మారిషస్‌కు చెందిన ఆ మూడు డొల్ల కంపెనీలు అదానీ ఎంటర్ ప్రైజెస్‌లో 6.82 శాతం, అదానీ ట్రాన్మిషన్ 8.03 శాతం, అదానీ టోటల్ గ్యాస్ 5.92 శాతం, అదానీ గ్రీన్ 3.58 శాతం వాటాలను కలిగి ఉన్నాయి. ఈ దెబ్బకు అదానీ స్టాక్స్‌పై మదుపర్లకు విశ్వాసం సన్నగిల్లడంతో ఆ కంపెనీల షేర్లు వరుస నష్టాల పాలవుతున్నాయి.
ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్స్ సూచీ ప్రకారం.. శుక్రవారం ముగింపు నాటికి అదానీ సంపద 56.1 బిలియన్ డాలర్ల (రూ.4.15 లక్షల కోట్లు)కు పడిపోయిందది. జూన్ 14 నాటికి ఈ విలువ 74.9 బిలియన్ డాలర్లు (రూ.5.13 లక్షల కోట్లు)గా ఉంది. 20 రోజుల్లోనే రూ.1.40 లక్షల కోట్లు సంపద హరించుకుపోవడంతో గ్లోబల్ బిలియనీర్ జాబితాలో అదానీ స్థానం టాప్ -20 నుంచి 22కు దిగజారింది. ఒక్క శుక్రవారం సెషన్లోనే అదానీ నాలుగు కంపెనీల షేర్లు 5 శాతం మేర పడిపోయాయి. దీంతో ఒక్క పూటలోనే 3.7 బిలియన్ డాలర్ల (రూ.27.38 వేల కోట్లు) సంపద కరిగి పోయింది. ఇదే సెషన్లోనే రిలయన్స్ ఇండిస్టీస్ ఛైర్మన్ ముకేష్ అంబానీ సంపద 700 మిలియన్ డాలర్లు (రూ.5,216 కోట్లు) పెరిగింది. 81.1 బిలియన్ డాలర్ల సంపద (రూ.6లక్షల కోట్లు)తో ఆసియాలనే అత్యంత ధనవంతుడిగా ముకేష్ కొనసాగుతున్నారు.