Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐదు లక్షల దిగువకు యాక్టివ్ కేసులు
- డెల్టా వేరియంట్‌పై ప్రపంచ దేశాల ఆందోళన
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కొత్త కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. కొత్త మరణాలతో పాటు క్రియాశీల కేసులు సైతం తగ్గుతున్నాయి. శనివారం ఉదయం కేంద్ర, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 44,111 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 738 మంది వైరస్‌తో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసులు 3,05,02,362కు చేరాయి. మరణాలు 4,01,050కి పెరిగాయి. కొత్తగా 57,477 మంది కోలుకోవడంతో ఆ సంఖ్య 2,96,05,779కి చేరింది. యాక్టివ్ కేసులు సైతం ఐదు లక్షల దిగువకు చేరాయి. ప్రస్తుతం 4,95,533 మంది ఆస్పత్రులు, హౌం క్వారంటైన్లో ఉండి చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు మొత్తం 41,64,16,463 కరోనా పరీక్షలు నిర్వహించినట్టు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) వెల్లడించింది. శుక్రవారం ఒక్కరోజే 18,76,036 శాంపిళ్లను పరీక్షించినట్టు తెలిపింది. అలాగే, మొత్తం 34,46,11,291 వ్యాక్సిన్ డోసులు వేశారు.
కాగా, దేశంలో కరోనా కేసులు అధికంగా నమోదైన రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర, కేరళ, కర్నాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బెంగాల్, ఢిల్లీ, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లు టాప్-10లో ఉన్నాయి. మరణాలు, పాజిటివ్ కేసులు అత్యధికంగా మహారాష్ట్రలో నమోదయ్యాయి. ఇదిలావుండగా, ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 183,958,871 కరోనా పాజిటివ్ కేసులు, 39,82,217 మరణాలు నమోదయ్యాయి. అత్యధిక కేసులు, మరణాలు అమెరికాలో చోటుచేసుకున్నాయి. ఆ తర్వాతి స్థానంలో భారత్, బ్రెజిల్, ఫ్రాన్స్, రష్యా, టర్కీ, యూకే, అర్జెంటీనా, కొలంబియా, ఇటలీ దేశాలు టాప్-10 లో ఉన్నాయి. గత రెండు వారాలుగా లాటిన్ అమెరికా దేశాలతో పాటు ఆఫ్రికా దేశాల్లో కరోనా ప్రభావం పెరుగుతోంది. అమెరికా, బ్రిటన్ సహా పలు దేశాలు డెల్టా వేరియంట్ విజృంభణ నేపథ్యంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.