Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూడో దశ క్లినికల్ ట్రయల్స్ ఫలితాలు విడుదల చేసిన భారత్ బయోటెక్
న్యూఢిల్లీ:కరోనా టీకా కోవాగ్జిన్ కోవిడ్-19పై మొత్తంగా 77.8 శాతం సామర్థ్యంలో పనిచేస్తున్నదని వ్యాక్సిన్ తయారీదారు భారత్ బయోటెక్ ప్రకటించింది. దీనికి సంబంధించిన మూడో దశ క్లినికల్ ట్రయల్స్ డేటాను విడుదల చేసింది. ఆ వివరాల ప్రకారం.. కరోనా లక్షణాలు తీవ్రంగా ఉన్నవారిలో కోవాగ్జిన్ 93.4 శాతం ప్రభావం చూపుతున్నదని భారత్ బయోటెక్ వెల్లడించింది. ప్రస్తుతం ప్రపంచ దేశాలను మరింత ఆందోళనకు గురిచేస్తున్న డెల్టా వేరియంట్‌పై కూడా కోవాగ్జిన్ 65.2 శాతం ప్రభావం చూపుతున్నదని పేర్కొంది. దీని గురించి భారత్ బయోటెక్ ఎండీ డాక్టర్ కృష్ణ ఎల్లా మాట్లాడుతూ.. ఇప్పటివరకు వెలుగుచూసిన అత్యంత ప్రమాదకరమైన డెల్టా వేరియంట్ సహా పలు ఇతర మ్యూటెంట్లపైనా తమ వ్యాక్సిన్ పనిచేస్తుందన్నారు. కరోనా సంక్రమణ కారణంగా తలెత్తే తీవ్ర లక్షణాలను కోవాగ్జిన్ అడ్డుకుంటుందనీ, ఫలితంగా ఆస్పత్రిలో చేరే అవసరాన్ని తగ్గిస్తుందని వివరించారు. ఈ క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేయడం ద్వారా అభివృద్ధి చెందుతున్న దేశాలు సైతం కరోనా వ్యాక్సిన్‌ను తయారు చేయగలవని నిరూపించినట్టుగా ఎల్లా పేర్కొన్నారు.
కాగా, కోవాగ్జిన్ మూడో దశ ట్రయల్స్ ఫలితాలను మెడికల్ జర్నల్ మెడ్జివ్ ప్రచురించింది. భారత్‌లో పెద్ద ఎత్తున జరిగిన మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌లో కోవాగ్జిన్ సురక్షితమై, మెరుగైన సామర్థ్యం కలిగిన వ్యాక్సిన్‌గా రుజువైందని తెలిపింది. గతేడాది నవంబర్‌లో జరిగిన మూడో దశ ట్రయల్స్‌లో 25,798 మంది పాల్గొని.. మొదటి డోస్ తీసుకున్నారు. అలాగే, ఈ ఏడాది జనవరి 7న 24,419 మంది రెండో డోసు తీసుకున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న వారిని 146 రోజులు పరిశీలించారు. కాగా, కోవాగ్జిన్ టీకాను భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్), నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ-పూణేల సహకారంతో భారత్ బయోటెక్ అభివృద్ధి చేసింది.