Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సంచులపై పార్టీ సింబల్ : బీజేపీ ఆదేశాలు
న్యూఢిల్లీ : పని తక్కువ.. ప్రచారం ఎక్కువ.. అన్న సామెత ప్రస్తుత కేంద్ర ప్రభుత్వానికి కరెక్టుగా సూటవుతుంది. ఇప్పుడు పేదలకు అందించే ఉచిత బియ్యం పంపిణీని కూడా తన ప్రచారానికి వాడుకుంటున్నది మోడీ సర్కార్. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (పీఎం-జీకేఏవై) కింద ఉచిత బియ్యం పంపిణీ చేస్తున్న బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని రేషన్ దుకాణాలవద్ద ప్రధాని మోడీ, ఆయా రాష్ట్ర ముఖ్యమంత్రులతో కూడిన బ్యానర్లను ఉంచాలని కమలం పార్టీ లేఖలో పేర్కొంది. బీజేపీయేతర రాష్ట్రాలు సైతం రేషన్ పంపిణీ చేసే బ్యాగులపై పార్టీ సింబల్ కమలం గుర్తు కనిపించాలని ఆదేశించింది. సెకండ్ వేవ్‌తో ఉపాధి కోల్పోయిన పేదలకు ఆర్థిక ఇబ్బందులను తగ్గించేందుకు రెండు నెలల పాటు ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాన్ యోజన పీఎం-జీకేఏవైను కేంద్రం పున్ణ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పుడు దాన్ని నవంబర్ చివరి వరకూ పొడిగించారు. ప్రతి ఒక్కరికీ ఐదు కిలోల ఆహార ధాన్యాలను ఉచితంగా అందించే ఈ పథకం ద్వారా జాతీయ ఆహార భద్రతా చట్టం (ఎన్ఎఫ్ఎస్ఏ) కింద 80 కోట్ల మంది లబ్డిపొందుతున్నారు. ప్రధాన మంత్రి అందిస్తున్న ఈ పథకాన్ని శక్తివంచన లేకుండా ప్రచారం చేయాలని బీజేపీ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఆయా రాష్ట్రాలకు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఈ మార్గదర్శకాలు పాటించేలా చూడాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులను ఆదేశించారు. ప్రస్తుతం కోవిడ్ వ్యాక్సిన్లు తీసుకున్నాక అందించే ధ్రువీకరణ పత్రంలో మోడీ ఫొటో ఉండటంపై ప్రతిపక్ష అధికారిక రాష్ట్రాలు తీవ్రంగా తప్పుపడుతున్నాయి. దీనికి నిరసనగా ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలు ముఖ్యమంత్రుల చిత్రాలతో వ్యాక్సిన్ ధ్రువీకరణ పత్రాలు అందిస్తున్నాయి.