Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోషణ్ డౌన్లోడ్ చేయాలి..లేదంటే వేతనాలు రావని ఆదేశాలు
న్యూఢిల్లీ : మోడీ సర్కార్ ఇటీవలి ఆదేశాలు అంగన్వాడీ కార్యకర్తల్ని ఆందోళనకు గురిచేస్తోంది. మొబైల్ యాప్ 'పోషణ్'ను మీ స్మార్ట్ఫోన్లలో డౌన్లోడ్ చేయనట్టయితే..మీ వేతనాల్లో కోతలు విధిస్తామని ఆ ఆదేశాల్లో కేంద్రం హెచ్చరించింది. అంగన్వాడీ కార్యకర్తల సేవల్ని ట్రాక్ చేయటం కోసం కేంద్రం పోషణ్ మొబైల్ యాప్ను రూపొందించింది. ఎట్టిపరిస్థి తుల్లో ఈ యాప్ వాడకాన్ని ప్రారంభించాలని కేంద్రం ఒత్తిడి తెస్తోంది. పంజాబ్, హర్యానా..సహా పలు రాష్ట్రాల్లో దీనికి సంబంధించి ప్రభుత్వ ఆదేశాలు వెలువడ్డాయి. ఇందుకోసం ఇప్పుడు ఉన్నఫళంగా స్మార్ట్ఫోన్ కొనటం, వాటికి రీచార్జ్ చేయటం ఆర్థికంగా తమకు వెసులుబాటు కాదని అంగన్వాడీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం ఆదేశాల్ని వ్యతిరేకిస్తూ పంజాబ్లో అంగన్వాడీ కార్యకర్తలు నిరసనకు కూడా దిగారు. ఏ రాష్ట్రంలోనూ ఎక్కడా అంగన్వాడీ కార్యకర్తలకు స్మార్ట్ఫోన్లు ఇవ్వలేదు, వాటికి రీచార్చ్ చేయలేదు, అలాంటిది 'పోషణ్' యాప్ను ఎలా డౌన్లోడ్ చేస్తారు? అని 'ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్' అధ్యక్షురాలు ఉషారాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. ''దేశవ్యాప్తంగా పనిచేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు ఆర్థికంగా చాలా వెనుకబడినవారు. వితంతులు, వికలాంగులు పనిచేస్తున్నారు. వీరిపై కేంద్రం ఇలాంటి భారాలు వేయవచ్చునా?'' ఆమె ప్రశ్నించారు.