Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫ్రాన్స్‌లో విచారణ షురూ...
- మీడియాపార్ట్ వార్తా కథనాల ఆధారంగా దర్యాప్తు
- హెచ్ఏఎల్ పక్కకు పోవటం వెనుక రాజకీయ కారణాలు
- రాజకీయ ఒత్తిడితోనే అనిల్ అంబానీ గ్రూప్‌తో డస్సాల్ట్ జాయింట్ వెంచర్
- డస్సాల్ట్ నుంచి అనిల్ అంబానీ గ్రూప్‌నకు నిధులు మల్లింపు : మీడియాపార్ట్
రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందంలో అక్రమాలు, ఆశ్రిత పక్షపాతం, అవినీతి చోటుచేసుకుందని ఫ్రాన్స్‌కు చెందిన న్యూస్ వెబ్సైట్ 'మీడియాపార్ట్' వార్తాకథనాలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఎందుకంటే 'డస్సాల్ట్ ఏవియేషన్' కంపెనీ అంతర్గత పత్రాలు, ఆడిటింగ్‌ను పరిశీలించి మీడియాపార్ట్ ఈ వార్తా కథనాలు వెలువరించింది. డస్సాల్ట్‌కు అనిల్ అంబానీ గ్రూప్‌నకు మధ్య జాయింట్ వెంచర్ పారదర్శకంగా లేదు. అనేక అవకతవకలు కనపడుతున్నాయి. భారత్‌లోని అధికార రాజకీయ వర్గాల ఒత్తిడితోనే పాత ఒప్పందాన్ని మార్చి...కొత్త ఒప్పందం చేశారని వార్తా కథనం పేర్కొన్నది. వీటిని పరిగణలోకి తీసుకున్న ఫ్రాన్స్ ఆర్థిక నేర విచారణ విభాగం 'పీఎన్ఎఫ్' స్వతంత్ర న్యాయ విచారణకు ఆదేశించింది.
న్యూఢిల్లీ : అత్యంత వివాదాస్పదమైన రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం మళ్లీ వార్తల్లో నిలిచింది. ఫ్రాన్స్‌కు చెందిన 'మీడియాపార్ట్' అనే న్యూస్ వెబ్సైట్ తన పరిశోధనాత్మక వార్తా కథనాలు సంచలనం సృష్టిస్తున్నాయి. ప్రధాని మోడీ పాత ఒప్పందాన్ని రద్దు చేసి..కొత్త ఒప్పందం చేస్తారని అనిల్ అంబానీ గ్రూప్‌నకు ముందే తెలుసునని..'మీడియాపార్ట్' అభిప్రాయపడింది. ఒప్పందం ఆసాంతం..అనేక అనుమానాలు, ఆశ్రిత పక్షపాతం, అవినీతి కనపడుతోందని తాజాగా వరుస కథనాలు వెలువరించింది. యుద్ధ విమానాల కొనుగోలు నిమిత్తం భారత ప్రభుత్వం డస్సాల్ట్‌కు చేసిన చెల్లింపుల్లో కొంత భాగం 'జాయింట్ వెంచర్' రూపంలో అనిల్ అంబానీ గ్రూప్‌కు నిధులు అందాయన్నది 'మీడియాపార్ట్' వార్తా కథనంలో ప్రధాన ఆరోపణ. వీటి ఆధారంగా ఫ్రాన్స్ ప్రభుత్వ విచారణ సంస్థ (పీఎన్ఎఫ్) జ్యుడీషియల్ విచారణకు ఆదేశించింది. 'మీడియాపార్ట్' పరిశోధనాత్మక వార్తా కథనాలు, ఫ్రెంచ్ ఎన్జీఓ సంస్థ సెర్పా ఇచ్చిన ఫిర్యాదుతో ఈ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. ఒప్పందంపై అవినీతి, పక్షపాతం వంటి ఆరోపణలపై దృష్టి సారిస్తామని ఫ్రెంచ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ సర్వీస్‌కు చెందిన ఫ్రాన్స్ ఆర్థిక నేర విచారణ విభాగం (పీఎన్ఎఫ్) వెల్లడించింది.ఆరోపణలపై అధికారికంగా జూన్ 14 నుంచి స్వతంత మేజిస్ట్రేట్ నేతృత్వంలో దర్యాప్తు జరుగుతోందని తెలిసింది.7.8 బిలియన్ యూరోస్ (రూ. 60 వేల కోట్ల ) ఒప్పందంపై న్యాయ విచారణకు ఓ ఫ్రెంచ్ జడ్జిని కూడా నియమించారు. ఒప్పందం సమయంలో ఫ్రాన్స్ అధ్యక్షుడిగా ఉన్న ఫ్రాంకోయిస్ హోలెండ్ చర్యలపై దర్యాప్తు చేస్తారని సమాచారం. ఆ ఒప్పందం సమయంలో ప్రస్తుత అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్...ఆర్థిక మంత్రిగా ఉన్నారు. అయితే ప్రస్తుత పరిణామాలపై డస్సాల్డ్ ఏవియేషన్ స్పందించలేదు.
మళ్లీ తెరపైకి ఎందుకు వచ్చింది?
రాఫెల్ ఒప్పందంలో అక్రమాలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణలపై 2019లో పీఎన్ఎఫ్ విచారణ చేయడానికి సుముఖత వ్యక్తం చేయలేదు. ఫ్రాన్స్ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని తాను ఈ నిర్ణయాన్ని తీసుకుంటున్నానని ఆనాడు పీఎన్ఎఫ్ హెడ్ ఇలైన్ హౌలెట్టీ తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. ఇప్పుడు ఆమె స్థానంలో పీఎన్ఎఫ్ హెడ్‌గా ఫ్రాంకోయిస్ బెనెర్ట్ వచ్చారు. మీడియాపార్ట్లో వచ్చిన తాజా వార్తా కథనాల్ని పరిగణలోకి తీసుకొని దర్యాప్తును జరపాలని బెనెర్ట్ నిర్ణయించారు. దర్యాప్తులో భాగంగా అప్పటి దేశాధ్యక్షుడు హోలాండే, ఆర్థికమంత్రిగా ఉన్న మేక్రాన్, రక్షణమంత్రి డ్రెయిన్ల పాత్రపై విచారణ దృష్టిసారించనున్నది.
పెట్టుబడి సగం సగం ఉండాలి కదా!
జాయింట్ వెంచర్లో డస్సాల్ట్, అనిల్ అంబానీ కంపెనీ చెరి సగం పెట్టుబడి పెట్టాలి. కానీ అలా జరగలేదు. గరిష్టంగా 169 మిలియన్ యూరోలు పెట్టుబడి పెట్టాలని అంగీకారం కుదరగా, అందులో 159 మిలియన్ యూరోలు డస్సాల్ట్ తన వాటాగా పెట్టుబడి పెట్టింది. కేవలం 10 మిలియన్ యూరోలు అనిల్ అంబానీ గ్రూప్ పెట్టుబడి పెట్టింది. పెట్టుబడి నిష్పత్తి ఇలా ఉండగా..వాటా దగ్గరకు వచ్చే సరికి అనిల్ అంబానీ గ్రూప్‌నకు 51శాతం వాటా వచ్చింది. డస్సాల్ట్‌కు 49శాతం వాటా దక్కింది. ఇది అనుమానాలకు తావిస్తోందని 'మీడియాపార్ట్' కథనం ఆరోపించింది.
మీడియాపార్ట్ ఏం చెబుతోంది?
- డస్సాల్ట్‌తో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ 'హెచ్ఏఎల్' చర్చలు జరుపుతున్న తరుణంలో అనిల్ అంబానీ గ్రూప్‌తో 'డీఆర్ఏఎల్' జాయింట్ వెంచర్ కుదరటం పలు అనుమానాలకు తావిచ్చింది.
- ప్రధాని మోడీ స్వయంగా రంగంలోకి దిగి హెచ్ఏఎల్ను పక్కకు తప్పించటమేకాదు, పాత ఒప్పందాన్ని (126 విమానాల కొనుగోలు) పూర్తిగా రద్దు చేశారు.
- నిజానికి డస్సాల్ట్‌కు అనిల్ అంబానీ గ్రూప్‌తో జాయింట్ వెంచర్ చేయటం ఇష్టం లేదని, కేవలం రాజకీయ కారణాలతో చేయాల్సి వచ్చిందని డస్సాల్ట్ అంతర్గత పత్రాలు చెబుతున్నాయని 'మీడియాపార్ట్' తాజాగా బయటపెట్టింది.
- ప్రధాని మోడీ ఫ్రాన్స్ పర్యటన (ఏప్రిల్ 10, 2015) తర్వాత డస్సాల్ట్‌కు అనిల్ అంబానీ గ్రూప్‌నకు మధ్య జాయింట్ వెంచర్ కుదిరినట్టు పైకి కనపడుతోంది. ఇది నిజం కాదు ప్రధాని మోడీ పర్యటనకు రెండు వారాల ముందే మార్చి 26, 2015న డస్సాల్ట్, అనిల్ అంబానీకి మధ్య జాయింట్ వెంచర్ కుదిరింది.
స్వతంత్ర దర్యాప్తు చేయాలి : సీపీఐ(ఎం)
''మోడీ ప్రభుత్వం తన పెట్టుబడిదారీ స్నేహితులకు రక్షణ కల్పిస్తూ అండగా ఉండటం వలనే రాఫెల్ ఒప్పందంలో చోటుచేసుకున్న అవినీతికి సంబంధించి ఫ్రెంచ్ ఏజెన్సీలు చేస్తున్న దర్యాప్తునకు భారత్ గురవుతున్నది. ఇది సిగ్గుచేటు. రాఫెల్ ఒప్పందంపై స్వతంత్ర దర్యాప్తు చేయాలి'' అని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ డిమాండ్ చేసింది.