Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్పీఓ హత్య కేసులో రిపోర్టింగ్‌పై జమ్మూకాశ్మీర్ పోలీసుల అభ్యంతరం
జమ్మూకాశ్మీర్ : న్యూస్ వెబ్సైట్ 'ది వైర్'కు జమ్మూకాశ్మీర్ పోలీసులు షోకాజ్ నోటీసును జారీ చేశారు. స్పెషల్ పోలీస్ ఆఫీసర్ (ఎస్పీఓ) ఫయాజ్ అహ్మద్ భట్ హత్య విషయంలో ది వైర్ ప్రచురించిన రెండు ఆర్టికల్లపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈ చర్యకు దిగారు. ఈ విషయంలో చర్యలు ఎందుకు తీసుకోకూడదో వారంలోగా వివరణ ఇవ్వాలంటూ 'ది వైర్' ఎడిటర్-ఇన్-చీఫ్‌ను పోలీసులు ప్రశ్నించారు. ఇలాంటి వార్తలు ప్రజల్లో భయాందోళనలు కలిగించడమే కాకుండా, ఈ ప్రాంతంలో పని చేసే పోలీసులు, భద్రతా సిబ్బంది మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసి వారి ప్రతిష్టను దిగజారుస్తాయని నోటీసును జారీ చేసిన కాశ్మీర్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ విజరు కుమార్ తెలిపారు. ఈ కేసులో ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ముందు అధికారికంగా ఫిర్యాదును ఎందుకు నమోదు చేయకూడదో ఎడిటర్-ఇన్-చీఫ్ వివరణ ఇవ్వాలన్నారు. కాగా, తమ వార్త సంస్థకు పోలీసుల నుంచి నోటీసు అందలేదని 'ది వైర్' వ్యవస్థాపక ఎడిటర్ సిద్దార్థ్ వరదరాజన్ తెలిపారు. రాజ్యాంగం పట్ల జమ్మూకాశ్మీర్ పోలీసులకు ఎంత తక్కువ అవగాహన ఉన్నదో సదరు 'నోటీసు' తెలియజేస్తున్నదని అన్నారు.