Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు కుంభకోణంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)తో విచారణ చేయించాలని, తద్వారా ఈ కుంభకోణంలో ప్రధాని మోడీతో పాటు, కేంద్ర ప్రభుత్వ పాత్రపై నిగ్గు తేల్చి వాస్తవాలను బయటకు వెల్లడించాలని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో డిమాండ్ చేసింది. దేశంలో కరోనా పరిస్థితులు, పెరుగుతున్న పెట్రోధరలు, ఇతర పరిణామాలపై పొలిట్‌బ్యూరో సమా వేశం శనివారం నుంచి రెండు రోజుల పాటు ఇక్కడ జరిగింది. సమా వేశం అనంతరం పొలిట్‌బ్యూరో ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. రాఫెల్ కుంభకోణం గురించి ప్రస్తావిస్తూ, 2016లో భారత్ కు రూ.59 వేల కోట్ల రాఫెల్ యుద్ధ విమానాల అమ్మకంలో పెద్దయె త్తున అవినీతి, ఆశ్రిత పక్షపాతం చోటుచేసుకున్నట్లు వచ్చిన ఆరోపణ లపై ఫ్రాన్స్‌కు చెందిన ఫ్రెంచ్ ప్రాసిక్యూషన్ సర్వీసెస్(పిఎన్ఎఫ్) న్యాయవిచారణకు ఆదేశించింది. రెండు ప్రభుత్వాల మధ్య కుదిరిన ఈ ఒప్పందంపై ఈ ఏడాది జూన్ 14న అధికారికంగా న్యాయ విచారణ ప్రారంభమైంది. డీల్‌కు సంబంధించి ఫ్రాన్స్‌కు చెందిన ఒక ఇన్వెస్టిగేటివ్ వెబ్సైట్ బహిర్గతం చేసిన అధికారిక పత్రాల ప్రకారం.. రాఫెల్ యుద్ధవిమానాల తయారీదారు డసాల్ట్ ఏవియేషన్, అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్ 2015, మార్చి 26న ఈ ఒప్పందం చేసుకున్నాయి. ఇది కొత్త ఒప్పందానికి సంబంధించి హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఎఎల్)ను తప్పిస్తూ ప్రధాని మోడీ ప్రకటన చేయడానికి 15 రోజుల ముందు చోటుచేసుకోవడం గమనార్హం. దీన్నిబట్టి అంతకుముందు ఒప్పందం నుంచి మోడీ యూటర్న్ తీసుకొని లోతైన అవినీతి, మనీలాండరింగ్‌లో చిక్కుకు న్నారనేది మరోసారి స్పష్టమైంది. ఈ మొత్తం వ్యవహారంలో ప్రధాని, ప్రభుత్వ పాత్రకు సంబంధించిన నిజాలను బయటపెట్టేందుకు దీనిపై జేపీసీతో దర్యాప్తు జరిపించాలని 2018 సెప్టెంబరులో లేవనెత్తిన డిమాండ్‌ను పొలిట్‌బ్యూరో పునరుద్ఘాటిస్తున్నది.