Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా రెండో దశ ప్రభావం తగ్గుముఖం పట్టిందని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. అయితే కేసుల సంఖ్యలో ఏమంత తగ్గుదల కనిపించడం లేదు. కరోనా ప్రభావం ఇప్పటికీ భయంకరంగాను, ఆందోళనకరంగాను ఉంది. పెద్దయెత్తున ఉచిత సార్వత్రిక వ్యాక్సినేషన్ కార్యక్రమం ద్వారానే దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి అరికట్టడంతో పాటు మన దేశ ప్రజల ప్రాణాలను కాపాడుకోగలుతాం. ఈ ఏడాది ఆఖరుకల్లా దేశంలోని వయోజనులందరికీ వ్యాక్సిన్ వేయాలన్న లక్ష్యాన్ని చేరుకునేందుకు 190 కోట్ల డోసులు అవసరమవుతాయని ప్రభుత్వం పేర్కొంది. 2021 ఆగస్టు, డిసెంబర్ మధ్య 216 కోట్ల వ్యాక్సిన్ డోసులు అందు బాటులో ఉంటాయని మే 13న పేర్కొన్న మోడీ ప్రభుత్వం, జూన్ 26న సుప్రీంకోర్టుకు ఇచ్చిన ఆఫిడవిట్లో వ్యాక్సిన్ల లభ్యతను గణనీయంగా తగ్గించేసి, 135 కోట్ల డోసులు మాత్రమే అందుబాటులో ఉంటాయని తెలిపింది.వ్యాక్సిన్ల కొరత ఇంత భయంకరంగా వుంటే ఈ ఏడాది చివరి నాటికి నిర్దేశించుకున్న టార్గెట్‌ను అది ఏవిధంగా చేరుకుంటుంది. ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న వనరుల ద్వారా మోడీప్రభుత్వం వెంటనే వ్యాక్సిన్లను కొనుగోలు చేసి, వ్యాక్సి నేషన్ డ్రైవ్ వేగం పెంచాలని సిపిఎం పొలిట్‌బ్యూరో డిమా ండ్ చేసింది. కరోనా మూడో దశను ఎదుర్కొనేందుకు దేశ ప్రజలు సిద్ధంగా లేరని, సార్వత్రిక వ్యాక్సిన్ ద్వారా మూడో దశ ప్రమాదాన్ని నివారించడం అత్యవసరమని పేర్కొంది.
విపరీతంగా ధరల పెరుగుదల
ప్రజల జీవనోపాధి సంక్షోభానికి తోడు నిత్యం పెరుగుతున్న పెట్రోలియం ధరలు ప్రత్యక్షంగా ద్రవ్యోల్బణ వలయాన్ని సృష్టిస్తున్నాయి. అన్ని ఆహార పదార్ధాల ధరలు పెరుగుతున్నాయి. వంటనూనెల ధరలు అయితే ఆకాశాన్నంటుతున్నాయి. సబ్సిడీ ఎల్పిజి సిలెండర్ అయితే గత ఏడు నెలల కాలంలో దాదాపు రూ.250 పెరిగింది. పెట్రోల్, డీజిల్‌పై విధించే ఎక్సైజ్ సుంకాలను మోడీ ప్రభుత్వం దారుణంగా వరుసగా 258, 820 శాతాల మేరకు పెంచేసింది. కరోనా సంక్షోభ కాలంలో దేశ ప్రజలు ఇప్పటికే ఆర్థికంగా అనేక ఇబ్బందులు పడుతుంటే, కేంద్రం వారిపై ఇంకా భారాలు మోపుతూ ఆదాయాలు రాబట్టుకునే వినాశకరమైన పనిలో ఉంది. పెట్రోలియం ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాలను రద్దు చేయడంతో పాటు, పెరుగుతున్న నిత్యావసరాల ధరలకు కళ్లెం వేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని పొలిట్‌బ్యూరో ఈ ప్రకటనలో డిమాండ్ చేసింది. అదేవిధంగా ఆదాయ పన్ను పరిధిలో లేని కుటుంబాలకు తక్షణం రూ.7,500 ప్రత్యక్ష నగదు బదిలీ చేయాలని, ఇంటిలో రోజువారీ వినియోగానికి సంబంధించిన వస్తువులతో కూడిన ఆహార కిట్లను ఉచితంగా పంపిణీ చేయాలని డిమాండ్ చేసింది.
క్రూరమైన ఇడిఎస్ఒ ఆర్డినెన్స్‌ను ఉపసంహరించుకోవాలి
ఆశ్రిత పెట్టుబడిదారులకు పెద్దయెత్తున లాభాలను చేకూర్చేందుకు కీలకమైన ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల కార్పొరేటీకరణకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 41 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను ఏడు కార్పొరేషన్లుగా ముక్కలు చేయాలని కేంద్రం మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. దీనిపై రక్షణ రంగ ఉద్యోగులు, కార్మికులు ఇప్పటికే ఆందోళన బాటపట్టారు. ఈ నేపథ్యంలో రక్షణ రంగ ఉద్యోగులు ఆందోళనలు, సమ్మెలో పాల్గొనడంపై నిషేధం విధిస్తూ మోడీ సర్కార్ ఇటీవల అత్యవసర రక్షణ సేవల అర్డినెన్స్-2021ను జారీచేసింది. ఈ క్రూరమైన ఆర్డినెన్స్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం పొలిట్‌బ్యూరో డిమాండ్ చేసింది. అదేవిధంగా వ్యూహాత్మక రంగంలో కేవలం నాలుగు ప్రభుత్వ రంగ సంస్థలు మాత్రమే ఉంటాయని కేంద్రం ప్రకటించింది. ఇది ఎంతమాత్రం అనుమతించరానిది. మన జాతి సొత్తు బహిరంగ లూటీకి వ్యతిరేకంగా ఆందోళనలను తీవ్రతరం చేయాలని పొలిట్‌బ్యూరో పిలుపునిచ్చింది.