Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : దేశంలో రికార్డు స్థాయిలో పెరుగుతున్న చమురు ధరలు వాహనదారుల నడ్డి విరుస్తున్నాయి. మే నుంచి వరుసగా పెరుగుతూ వస్తున్న చమురు ధరలు ఆదివారం కూడా మరోసారి పెరిగాయి. లీటరు పెట్రోల్‌పై 36 పైసలు, డీజిల్‌పై 20 పైసల వరకు చమురు కంపెనీలు పెంచాయి. దీంతో దేశంలోని చాలా నగరాల్లో పెట్రోల్ ధరలు సెంచరీ కొట్టాయి. లీటరు డీజిల్ ధర పలు ప్రాంతాల్లో రూ.100కు చేరగా, మరికొన్ని ప్రాంతాల్లో సెంచరీ దిశగా పరుగులు పెడుతున్నాయి. తాజాగా పెరిగిన ఇంధన ధరలతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.99.51, డీజిల్ రూ.89.36కు చేరాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో లీటర్ పెట్రోల్ రూ.105.98, డీజిల్ రూ.96.91కు పెరిగింది. కాగా, మే 4వ తర్వాత నుంచి ఇప్పటి వరకు పెట్రోల్ ధరలను చమురు కంపెనీలు 35 సార్లు పెంచాయి. డీజిల్ ధరలను 34 సార్లు పెంచాయి. మొత్తంగా మే నుంచి ఇప్పటివరకు లీటరు పెట్రోల్‌పై రూ.9.19, డీజిల్‌పై రూ.8.57 వరకు పెరిగింది. తాజాగా బెంగాల్ రాజధాని కోల్‌కతాలో పలు చోట్ల లీటరు పెట్రోల్‌ను రూ.100కు విక్రయిస్తున్నారు. దేశంలోని అనేక నగరాలు, పట్టణాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. రెండు తెగులు రాష్ట్రాల్లోనూ ప్రస్తుతం ఇదివరకటి ఇంధన గరిష్ట ధరలను అధిగమించాయి. హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ రూ.103.41, డీజిల్ రూ.97.40గా ఉంది. చెన్నైలో పెట్రోల్ రూ.100.44, డీజిల్ రూ.94.72, బెంగళూరులో పెట్రోల్ రూ.102.84, డీజిల్ రూ.94.54, పాట్నాలో పెట్రోల్ రూ.101.62, డీజిల్ రూ.94.76, భోపాల్‌లో రూ.107.80, డీజిల్ రూ.98.13, లక్నోలో పెట్రోల్ రూ.96.65, డీజిల్ రూ.89.75గా ఉంది. కాగా, ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి గత కొన్ని నెలలుగా ఇంధన ధరలు నిరంతరంగా పెరుగుతూ వస్తున్నాయి. ఆ మధ్య ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కొద్ది రోజులు స్థిరంగా కొనసాగిన చమురు ధరలు.. ఎన్నికలు ముగిసి.. ఫలితాలు వెలువడినప్పటి నుంచి పెరుగుతూనే ఉన్నాయి. దీనికి ప్రపంచ ముడిచమురు ధరలు, విదేశీ మారక రేట్ల హెచ్చుతగ్గులు కారణంగా ఉన్నప్పటికీ.. పెట్రోల్, డీజిల్‌పై దేశంలో అధిక పన్ను రేటు కూడా ఓ కారణంగా ఉంది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ ముడి బ్యారెల్‌కు 76.17 డాలర్లుగా ఉంది.